వంశీకృష్ణ అరెస్ట్. అసలు ఏం జరిగింది..?

వంశీకృష్ణ అరెస్ట్. అసలు ఏం జరిగింది..?

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని కాటమయ్య కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిలో పట్టపగలు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న రూ. 14. 20 లక్షల నగదును దొంగిలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వేటపాలెం నంది నగర్ చెందిన నిందితుడి మిక్కిలి శాం రిచర్డ్ అలియాస్ వంశీ కృష్ణ (45) ను అరెస్టు చేసారు. అతని నుండి రూ. 9.10 లక్షల నగదును, హ్యుందాయ్ ఎక్స్టర్ కార్ ను, ఐఫోన్ 16 ప్రో మాక్స్, ఒప్పో మొబైల్ ఎఫ్ 25 ప్రో, హెచ్‌పి ల్యాప్‌టాప్, కానన్ కెమెరా, బ్యాటరీ లెన్స్, ఈఓస్ రెబెల్ జె6, 75-300 ఎంఎం జూమ్ లెన్స్‌తో పాటు, అదనపు ఛార్జర్ బ్యాటరీ, మోటరోలా కీప్యాడ్ ఫోన్, మూడు చిన్న కడ్డీలు, శాంసంగ్ స్మార్ట్ మొబైల్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా చౌటుప్పల్ డి.ఎస్.పి పటోళ్ళ మధుసూదన్ రెడ్డి తెలిపారు.

చౌటుప్పల్ డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన దొంగతనం వివరాలను వెల్లడించారు. నిందితుడు వంశీకృష్ణ గతంలో హైదరాబాద్ లోని బాలానగర్ లో 2, బేగంబజార్ లో 1, బేగంపేట్ లో 1, చైతన్యపురి లో 2, చిక్కడపల్లిలో 3 కేసులలో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలోని కాటమయ్య కాలనీలో నివసించే లింగంపల్లి నరసింహ (45) గత ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం సుమారు 11 గంటల సమయంలో తన ఇంటికి తాళం వేసి, భార్య లక్ష్మితో కలిసి హయత్‌నగర్‌లోని చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కుమార్తె శ్రీతికను చూడడానికి వెళ్లారు. అదే రోజు రాత్రి సుమారు 22:50 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటం గమనించారు.

ఇంట్లోకి వెళ్లి చూడగా అల్మారాలోని బట్టలు చెల్లాచెదురుగా పడివుండి, అల్మారా తలుపు తెరిచి ఉంది. అల్మారాలో ఉంచిన రూ. 14.20 లక్షల నగదు కనిపించలేదు. గుర్తు తెలియని దొంగలు దొంగిలించినట్లు గుర్తించి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి ఎస్ పి అక్షాంశ్ యాదవ్, అడిషనల్ ఎస్పి సిహెచ్ లక్ష్మీనారాయణల ఆదేశాల మేరకు, చౌటుప్పల్ డీస్పీ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి.మన్మధ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ డి ప్రవీణ్‌ బాబు, ఎస్సై కనకటి యాదగిరి, సిసిఎస్ ఎస్సై లు వనం సైదులు, బి కుమార స్వామి, హెడ్ కానిస్టేబుల్స్ నర్సిరెడ్డి, మల్లాం సందీప్, ఎం భారద్వాజ్, ఉడుగు సైదులు, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాసన్, బాలస్వామి, పీసీ లు మహేశ్, సీతారాం, అశోక్, శ్రీకాంత్, ఎం సైదులు, పి సైదులు, జి గోపాల్, జి మహేశ్, ఎస్ ఉదయ్, విజేందర్, షేక్ మొహమ్మద్, బి నవీన్, వెంకటేష్ హెచ్ జి 890 కలిసి విచారణ చేపట్టారు.

మండలంలోని ధర్మోజీగూడెం స్టేజి వద్ద నిందితుడు వంశీకృష్ణ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి అతని నుండి నగదును, కారు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లుగా డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కేసులు వేగవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు అతని నుంచి దొంగలించిన నగదును స్వాధీనం చేసుకున్న ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తో పాటు ఎస్ఐలు, పోలీస్ సిబ్బందిని డిఎస్పి అభినందించి రివార్డులను అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ తో పాటు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

Leave a Reply