AP | వ‌ల్ల‌భ‌నేని బెయిల్ పిటిష‌న్ విచార‌ణ మ‌రోసారి వాయిదా

విజ‌య‌వాడ : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 26వరకు వాయిదా పడింది. గన్నవరం టీడీపీ కార్యాలయంలపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరించి కేసుపై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

ఇప్పటికే మూడు దఫాలుగా వాదనలు వినిపించారు. ప్రధానంగా వంశీ తరపున న్యాయవాది వాదనలు వినిస్తూ.. ఈకేసులో వంశీని అన్యాయంగా ఇరికించారని, అనారోగ్య కారణాలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని, అలాగే నెలరోజుల పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో వంశీకి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది వాదనలు వినిపించారు.

అయితే సత్యవర్ధన్‌ను బెదిరించి, కిడ్నాప్ చేసిన వ్యవహారంపై అనేక ఆధారాలు సేకరించారని, వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ సాక్షులను బెదిరించడమో, భయపెట్టడమో చేస్తారని ప్రాసిక్యూషన్ వాదించారు. అలాగే విదేశాలకు కూడా వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వంశీకి బెయిల్‌ పిటిషన్‌ను రద్దు చేయాలని వాదనలు వినిపించారు. నిన్న(గురువారం) బెయిల్ పిటిషన్‌కు సంబంధించి ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయాధికారి ఈరోజు విచారణను వాయిదా వేశారు. నేడు తీర్పు వస్తుందని భావించినప్పటికీ విచారణ‌ను ఈనెల 26కు వాయిదా వేశారు న్యాయమూర్తి.

Leave a Reply