సృష్టికర్త పరమాత్మ 84 లక్షల రకాల జీవులను సృజించి ఈ భూమిపై నియమించాడు. ఆ జీవులలో ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు చైతన్యం నింపి పునరుత్పత్తి చేసుకునేలా చేశారు. అనుక్షణం సృష్టి, స్థితి, లయలు జరిగేలా ప్రకృతిలో త్రిగుణాలను కల్పించారు. ఇది కోటానుకోట్ల జీవాత్మలలో పరమాత్మ ఆడుకునే పరమపద సోపాన వైకుంఠపాళీ. ఈ మాయా ప్రహేళికలో తమ తమ ప్రారబ్ద, సంచిత, ఆగామి, కర్మ ఫలాలను స్వీకరించి ఆడక తప్పదు. మరి ఈ ప్రహేళికను ఏ విధంగా పూరించాలి? అనే ప్రశ్న ఉదయించక తప్పదు.

జీవన మరణ చక్రంలో జీవాత్మలను తిప్పడమే పరమాత్మ మాయా క్రీడ. అయితే ఈ జీవులలో ఆత్మాన్వేషణ చేసుకునే అవకాశం కల్పించాడు. జీవాత్మకు ఉత్తమమైన ఉపాధి కల్పనే మానవజన్మ. దుర్లభమైన మానవజన్మను ఏ జీవాత్మ సఫలం చేసుకొని నవవిధ భక్తి మార్గంలో పయనించి తుదకు పరమాత్మలో లయం చేసుకుంటుందో ఆ జీవాత్మకు పునర్జన్మ ఉండదు. జీవులన్నీ ఆత్మ స్వరూపాలే జీవాత్మలన్నీ నిరంతరం ఆ పరమాత్మతో అనుసంధానించబడి ఆయన మహిమాన్విత వీక్షణ సూత్రాలతో చెల్లిస్తూ ఉంటాయి.

ఈ మాయా క్రీడ మానవ మేధకు అందని అద్భుతమైన అఖండ అంతర్జాలం. ఈ మాయా రహస్యాన్ని ఛేదించడం సురాసురుల వల్ల కాలేదు. ఇక మానవుల వల్ల ఏమవుతుంది? అందువలన “బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య” అను ఆదిశంకరుల సత్యవాక్కును శిరసా వహించి నిత్య సత్యమైన ఆ పరమాత్మను సదా ధ్యానిస్తూ “పరోపకారం ఇదం శరీరం” గా జీవించి జన్మరాహిత్యం పొందడమే వివేకం. అని మన సనాతన వాంగ్మయం విశద పరుస్తోంది.


-వారణాశి వెంకట సూర్య కామేశ్వర రావు

Leave a Reply