రసవత్తరంగా ఉట్నూర్ పంచాయతీ ఎన్నిక..

  • ముగిసిన ప్రచారాలు, నిశ్శబ్దమైన కాలనీలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డ్‌ మెంబర్‌ ఎన్నికల ప్రచారం ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల పోటీతో రసవత్తరంగా సాగింది. అభ్యర్థులు వాహనాలపై తమ ఫోటో గుర్తులతో ఫ్లెక్సీలు కట్టించి, ఆకర్షణీయమైన పాటలతో గత వారం రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించారు.

ఉదయం నుంచి రాత్రివరకు కాలనీల్లో మైకుల శబ్దాలు మార్మోగాయి. మంగళవారం ప్రచార గడువు ముగియడంతో గ్రామంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. సర్పంచ్ పదవికి 16 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఒకరు ఉపసంహరణతో 15 మంది అభ్యర్థులు బరిలో నిలవడం వల్ల పోటీ తీవ్రతరం అయింది.

ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు తమ శైలిలో ప్రచారం నిర్వహించగా, స్వతంత్ర అభ్యర్థులు కూడా వారికి టక్కర్ ఇస్తూ ప్రచారం సాగించారు. అభ్యర్థులంతా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, అందులో నలుగురి మధ్యే కీలక పోటీ ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 3 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీనిస్తున్నట్లు సమాచారం.

అసెంబ్లీ తరహాలో సాగిన ప్రచారం

ఈసారి ఉట్నూర్ పంచాయతీ ఎన్నికల ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. 15 మంది అభ్యర్థులు ఆటోలు, జీపులు, మైకులు, ఫ్లెక్సీలు ఉపయోగించి విస్తృత ప్రచారం నిర్వహించారు. కొబ్బరి చెట్టు గుర్తుపై ఎన్నికల్లో ఉన్న అభ్యర్థి అయితే ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో ప్రచారం నిర్వహించడం ఆకర్షణీయంగా నిలిచింది. కాలనీల్లో మైకుల శబ్దాలు రోజంతా మార్మోగి, గ్రామ వాతావరణం పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి మారిపోయింది.

Leave a Reply