USERS | వంటగదిలో యుద్ధం..

USERS | వంటగదిలో యుద్ధం..

USERS | ఒకవైపు కేవైసీ గందరగోళం.. మరోవైపు రీ-ఫిల్లింగ్ దందా!
సామాన్యుడి సిలిండర్… బ్లాక్ మార్కెట్ పాలు!
డొమెస్టిక్ టు కమర్షియల్.. వేలల్లో దోపిడీ!
అక్రమ నిల్వలపై నిఘా.. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

USERS | ప‌ల్నాడుబ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ‌ : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు జిల్లాలోని వంటగ్యాస్ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందనే భయం, మరోవైపు స్థానికంగా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఎదురవుతున్న సాంకేతిక, ఆర్థిక ఇబ్బందులు సామాన్యుడికి కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా నెమ్మదించడం వల్ల జిల్లాకు వచ్చే స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్ ప్రక్రియ మందగించింది. దీనివల్ల పల్నాడు జిల్లాలోని ప్రధాన కేంద్రాలైన నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మాచర్ల వంటి ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్లింగ్ సమయం పెరిగింది.అధికారులు “అన్నీ బాగున్నాయి” అని చెబుతున్నా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులు సమస్యలతో సతమతమవుతున్నారు.

ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో కొందరు డీలర్లు నిల్వలను దాచిపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఫోన్ చేయగానే వచ్చే సిలిండర్, ఇప్పుడు వారం రోజులు వేచి చూడాల్సి వస్తోంది. ఇదే తరుణంలో హోటళ్లు, వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ సిలిండర్లను మళ్లించడం వల్ల సామాన్యులకు కొరత ఏర్పడుతోంది.రవాణా ఖర్చులు పెరిగాయని నెపంతో, డెలివరీ బాయ్స్ నిర్ణీత ధర కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ఈ దోపిడీ మరీ ఎక్కువగా ఉందని బాధితులు వాపోతున్నారు.

గ్యాస్ కేవైసీ గందరగోళం….

గ్యాస్ సబ్సిడీ కొనసాగాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి అని చెప్పడంతో, జనం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ క్యూ కడుతున్నారు. సర్వర్లు పనిచేయకపోవడం, వేలిముద్రలు పడకపోవడంతో వృద్ధులు, కూలీలు పని మానుకుని రోజంతా వేచి ఉండాల్సి వస్తోంది. పల్నాడు జిల్లాలో వంటగ్యాస్ వినియోగదారులకు ఇప్పుడు ‘వంట’ కంటే ‘కేవైసీ’ పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వం సబ్సిడీలను క్రమబద్ధీకరించేందుకు తెచ్చిన ఈ నిబంధన, క్షేత్రస్థాయిలో సరైన ప్రణాళిక లేకపోవడంతో గందరగోళానికి దారితీస్తోంది.రోజువారీ కూలీలు, వ్యవసాయ కార్మికులు తమ పనులు మానుకుని గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం వల్ల వృద్ధులు పదేపదే ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోంది.గ్యాస్ కంపెనీల సర్వర్లు మొరాయిస్తున్నాయి.

గంటకు కేవలం పది మందికి కూడా ప్రక్రియ పూర్తి కావడం లేదు. ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్లు అందుబాటులో లేకపోవడం, ఓటీపీలు రాకపోవడంతో ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతోంది.పశ్చిమాసియా యుద్ధం వల్ల గ్యాస్ ధరలు పెరుగుతాయనే వార్తలకు తోడు, “కేవైసీ చేయించుకోకపోతే గ్యాస్ కనెక్షన్ రద్దవుతుంది” అనే ప్రచారం జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది.కేవైసీ అనేది కేవలం సబ్సిడీ అర్హతను నిర్ధారించే ప్రక్రియ మాత్రమే. కానీ, కనెక్షన్ కట్ అవుతుందనే భయంతో అందరూ ఒకేసారి వస్తుండటంతో ఏజెన్సీల వద్ద తోపులాటలు జరుగుతున్నాయి.కేవలం గ్యాస్ ఏజెన్సీల వద్దే కాకుండా, గ్రామ సచివాలయాల్లో కూడా కేవైసీ చేసుకునే సదుపాయం కల్పించాలి.ప్రజల్లో ఆందోళన తగ్గించేందుకు కేవైసీ గడువును పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించాలి.మారుమూల గ్రామాల్లో గ్యాస్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలి.

గ్యాస్ మాఫియా ‘రీ-ఫిల్లింగ్’ దందా…

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, కేవైసీ గందరగోళం ఒకవైపు వినియోగదారులను వేధిస్తుంటే, ఇదే అదనుగా భావించిన కొందరు అక్రమార్కులు “రీ-ఫిల్లింగ్” మాఫియాగా మారి సామాన్యుడి గ్యాస్‌ను కొల్లగొడుతున్నారు. పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ దందా బహిరంగంగానే సాగుతోంది.గృహ అవసరాలకు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే డొమెస్టిక్ సిలిండర్లను (14.2 కేజీలు) తక్కువ ధరకు సేకరిస్తున్న అక్రమార్కులు, వాటిని అత్యంత ప్రమాదకరమైన రీతిలో కమర్షియల్ సిలిండర్లలోకి మారుస్తున్నారు.గృహ సిలిండర్ సుమారు రూ. వెయ్యిలోపు ఉంటే, దానిని రీ-ఫిల్లింగ్ చేసి కమర్షియల్ పేరుతో ఏకంగా రూ.2500 నుండి రూ.3000 వరకు విక్రయిస్తున్నారు. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మరియు చిన్న తరహా పరిశ్రమలకు ఈ అక్రమ గ్యాస్‌ను సరఫరా చేస్తూ భారీగా లాభాలు గడిస్తున్నారు.

సాధారణ వినియోగదారులకు గ్యాస్ అందకపోవడానికి ప్రధాన కారణం ఇదేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఏజెన్సీల నుండి రావాల్సిన సిలిండర్లు దారి మళ్లుతున్నాయి.సామాన్య గృహిణి బుకింగ్ చేస్తే వారం రోజులైనా రాని సిలిండర్, బ్లాక్‌లో రూ.2000 పెడితే గంటలో ప్రత్యక్షమవుతోంది. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, చిన్న చిన్న గదుల్లో ఒక సిలిండర్ నుండి మరో సిలిండర్‌కు గ్యాస్ మార్చడం వల్ల భారీ పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉంది. గతంలో జిల్లాలో ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నా, అక్రమార్కుల్లో మార్పు రాకపోవడం గమనార్హం.యుద్ధం తెచ్చిన కష్టం కంటే, ఈ “అక్రమ సడేమియా” మూలంగానే పల్నాడులో గ్యాస్ కష్టాలు రెట్టింపయ్యాయి. అధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టకపోతే, సామాన్యుడి వంటింట్లో మంటలు ఆరిపోవడం ఖాయం.

గ్యాస్ స‌ర‌ఫ‌రాపై సందేహాల‌పై కంట్రోల్ రూమ్‌…

గ్యాస్ సరఫరా పై సందేహం ఉన్న యెడల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08647252999 కు ఫోన్ చేసి తెలుసుకోవ చ్చ‌ని అని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భ‌రోసా ఇచ్చారు. గ్యాస్ సరఫరా పై ఎప్పటి కప్పుడు సమాచారం తెలుసుకొనుటకు కలెక్టరేట్ కార్యాలయం లో కంట్రోల్ రూమ్ అన్ని పని దీనములో 24 గంటలు అందుబాటులో ఉంటారని వెల్ల‌డించారు. ప్రతి ఏజెన్సీ నందు తహశీల్దార్ ను గ్యాస్ సరఫరా పై పరవేక్షణ కొరకు నియమించటం జరిగింద‌న్నారు. గ్యాస్ రెఫిల్లింగ్ కొరకు బుకింగ్ చేసుకోవద్దని వద్దంతలు నమ్మవద్దని తెలిపారు.

వినియోగదారులు గ్యాస్ బిల్లు లో ఉన్న ధర మాత్రమే డెలివరి బాయ్ కి చెల్లించాలని, ఏ విదమైన అదనపు రుసుము చెల్లించనవసరం లేదన్నారు. ఎవ్వరైన ఎక్కువ మొత్తం డిమాండ్ చేస్తే పిర్యాదు చేయాల‌న్నారు. గ్యాస్ సిలిండర్ ఆక్రముగా నిల్వ చేసి కృతిమ కొరత సృష్టించే వ్యక్తులు సంస్థలపైన మరియు డొమెస్టిక్ సిలిండర్ వాణిజ్య అవసరాల వినియోగించే సంస్థలపైన కేసులు నమోదు చేయటం జరుగుతుందని తెలిపారు, వంటగ్యాస్ అనేది సామాన్యుడి ప్రాథమిక అవసరం. పశ్చిమాసియా సంక్షోభాన్ని సాకుగా చూపి స్థానిక దళారులు, ఏజెన్సీలు వినియోగదారులను దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. పల్నాడు జిల్లాలో అధికారులు ఇచ్చే “భరోసా” కాగితాలకే పరిమితం కాకుండా, ప్రతి ఇంటా సకాలంలో పొయ్యి వెలిగేలా చర్యలు తీసుకోవాలి.

Leave a Reply