హైదరాబాద్, ఆంధ్రప్రభ : యూరియా(Urea) పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ(Department of Agriculture) నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేసినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ బి.గోపి(B. Gopi) తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ యూరియా కేంద్రాలు 12 వేల వరకు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది రైతులు ప్రభుత్వ కేంద్రాల వద్దనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనితో ఆయా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడుతోంది. రద్దీని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ అదనంగా రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 500 రైతు వేదికల ద్వారా యూరియా పంపిణి చేయడానికి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ రోజు నుంచి పలు జిల్లాలోని రైతు వేదికల ద్వారా రైతులకు యూరియా అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి తెలిపారు. ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ కార్యాలయం(Office of Agriculture) నుంచి మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సీజన్ వరకే రైతు వేదికల్లో యూరియా పంపిణి కొనసాగనున్నట్లు తెలిపారు.