- ప్రకృతిని ఆరాధిస్తారు..
- పితృదేవతలను కొలుస్తారు..
- పెద్దలకు కృతజ్ఞతలుగా..
- కొత్తల పండగ నేడే…
ఆదివాసీ గ్రామాల్లో సందడి
వాజేడు, ఆంధ్రప్రభ : వారి జీవనం ప్రకృతితో ముడిపడి ఉంటుంది.. వారంతా పెద్దల మాటకు విలువిస్తారు. అందుకే వారికి పెద్దలన్నా, ప్రకృతి అన్నా, పంచప్రాణాలు. పెద్దల బాటలో ప్రకృతి ఆధారంగా మనుగడ సాగించే ఆదివాసీల పండగలు ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో కొత్తల పండగ సందడి కనిపిస్తోంది.
ఈ రోజు కొత్తల పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఇదొక సంప్రదాయ పండుగ…
కొత్తల (పెద్దల) పండుగ అనేది తెలంగాణలోని ఆదివాసీలు జరుపుకునే ఒక సంప్రదాయ పండుగ. ఇది ప్రకృతికి, పితృదేవతలకు కృతజ్ఞతలు తెలిపే పండగ కూడా! ఈ పండుగను ఉత్తర కార్తె మొదటి వారంలో జరుపుకుంటారు. దీనిలో కొత్తగా పండిన ధాన్యాన్ని, పాలను, చక్కెరతో చేసిన పాయసాన్ని పితృదేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తమ ఇలవేల్పులను పూజిస్తూ, తమ పూర్వీకులను స్మరించుకుంటారు.
పండుగ చేసేది ఇలా…

ఉత్తర కార్తె మొదటి వారం అంటే సెప్టెంబర్‌లో వచ్చే పెద్దల పండుగ లేదా కొత్తల పండగను పెద్ద అమావాస్య రోజు నిర్వహించుకుంటారు. కొత్తల పండుగ రోజున గూడాలన్నీ సంప్రదాయంతో నిండి ఉంటాయి. ఉదయమే లేచి పేడతో ఇల్లు అలికి ముగ్గులు వేసి తలస్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. పెద్ద మనుషులు తెల్లపంచ కట్టుకుంటారు. గుమ్మానికి మామిడి, వేపాకులతో తోరణాలు కట్టి, మొక్కజొన్న గానీ, వరి కంకులనుగానీ తోరణాల మధ్య కడతారు. తర్వాత సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, ముత్యాలమ్మ, కొమ్మలమ్మ, ముసలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, మూగరాజు, గాదె రాజు, బాల కుమారస్వామి, కాతూరుడు మొదలగు ఇలవేల్పులను కొలుస్తారు.
ఇలా మొక్కులు చెల్లిస్తారు…

వడ్డె దొర ఆదివాసుల కుల పెద్ద. కోడిపెట్టని అర్పించి, పాల ఆకులు, ఇప్ప ఆకులు ఇంటికి తెస్తారు. తల్లి కోడిని వడ్డె దొరని మొక్కి ఇప్ప సారా ఆరబోసి మిగతాది కుల పెద్దలు తాగుతారు. వడ్డె దొరకు ఆ ఇంటి చిన్న లేదా పెద్ద కోడలు కాళ్లు కడిగి దండం పెట్టుకుంటారు. నూకల బియ్యాన్ని కుటుంబ సభ్యులందరికీ వడ్డె దొర ఇస్తాడు. అందరూ ఆ బియ్యాన్ని కోడిపుంజుకు పోస్తూ మొక్కుతారు. ఆ తర్వాత ఆ కోడిని నైవేద్యంగా అర్పిస్తారు. అప్పుడే పితృదేవతలను స్మరించుకుంటారు. ఈ సందర్భంగా వారు మూడు తరాలవాళ్లని కొలుస్తారు. ఆరోజు గూడెం మొత్తం ఒక అపురూప వేడుకలా తయారవుతుంది.

