నూతన బొగ్గు గనుల సాధన కోసం


భవిష్యత్తులో యువతకు ఉపాధి కష్టతరం
కార్మిక సంఘాల ఐక్యవేదిక నేతల స్పష్ఠికరణ
ఖనిలో సింగరేణి పరిరక్షణకై రౌండ్ టేబుల్ సమావేశం
కేంద్రం జోక్యంతో సింగరేణి కష్టాలు : కోదండరాం


గోదావరిఖని (ఆంధ్రప్రభ) : బొగ్గు నిక్షేపాలు పుష్కలంగా ఉన్న… సింగరేణి బొగ్గు పరిశ్రమ మునగడ ప్రశ్నార్థకం కాబోతున్న నేపథ్యంలో నూతన బొగ్గు గనుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నేతలు (United Forum leaders of labor unions) పిలుపునిచ్చారు. శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణకై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐఎఫ్టియు, టీబీజీకేఎస్, ఎస్ జి కే ఎస్, టి ఎన్ టి యు సి, టి యు సి ఐ, టి ఎస్ యు ఎస్ తోపాటు పౌర హక్కుల సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు భాగస్వాములై సింగరేణి పరిరక్షణ కోసం సుదీర్ఘంగా చర్చించారు.

బొగ్గు గనుల ప్రైవేటుకరణకు జరుగుతున్న కుట్రలో భాగంగానే సింగరేణి (Singareni) పరిశ్రమకు కేంద్రం నూతన గనులు ఇవ్వలేకపోతుందని నేతలు ఈ సందర్భంగా గుంతెత్తారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని …స్థానిక యువతకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కష్టతరమైన పరిస్థితులు రాబోతున్నాయని ఆవేదన చెందారు. మరో 10 సంవత్సరాల్లో సింగరేణి సంస్థ కనుమరుగు కాబోతుందన్న ప్రచారం తో సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కార్మిక వర్గం మేలుకొని సంఘటితంగా ఉద్యమాలు చేపట్టాలని కోరారు. సింగరేణి బొగ్గు పరిశ్రమ బతికి ఉంటేనే ఈ ప్రాంత ప్రజానీకానికి ఉపాధి లభిస్తోందని నొక్కి చెప్పారు. నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకు బొగ్గు గనులు అప్పజెప్పాలని స్పష్టంగా డిమాండ్ చేశారు.

సింగరేణి పరిశ్రమను కాపాడుకునేందుకు చేపట్టబోయే సంఘటిత ఉద్యమం (Organized Movement) లో తామంతా భాగస్వాములమవుతావని కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. అదేవిధంగా సింగరేణిలో మారుపేరులతో కొనసాగుతున్న వారసుల సమస్య పరిష్కారానికి ఐక్యవేదిక అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సింగరేణి పరిరక్షణ కోసం చేపట్టబోయే ఉద్యమంలో భాగంగా కోల్ బెల్ట్ వ్యాప్తంగా పర్యటనలు చేపట్టాలని కార్మిక సంఘాల ప్రతినిధులు సూచనలు చేశారు. ఐ ఎఫ్ టు యు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఐ ఎఫ్ టు యు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్, సంఘాల నాయకులు మాదాసు రామ్మూర్తి, విశ్వనాధ్, మల్లేష్, కుమారస్వామి, రాజమౌళి, తోకల రమేష్, ఈ నరేష్, సీతారామన్న జైపాల్ సింగ్, మాధవ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం జోక్యంతోనే సింగరేణి బొగ్గు పరిశ్రమకు కష్టాలు ఎదురవుతున్నాయని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodandaram) అన్నారు. సింగరేణి పరిరక్షణకై చేపట్టిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కోదండరాం సుధీర్ గంధం మాట్లాడుతూ… బొగ్గు పరిశ్రమను రక్షించుకోవడానికి అతి త్వరలోనే పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా వర్క్ షాప్ నిర్వహించాలని చెప్పారు. నూతన బొగ్గు గనులు రాకపోతే సింగరేణి మనుగడ అసాధ్యమన్నారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు తగ్గాలని, అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సింగరేణి పరిరక్షణకు న్యాయ నీపుణులు, ఆర్థిక నిపుణులు, సాంకేతిక నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉంది అన్నారు. కార్మికుల ప్రయోజనానికి సమిష్టిగా కృషి చేద్దామని… సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులది వెట్టి చాకిరవుతుందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సింగరేణికి కొత్త గనులు ఇవ్వకుంటే ఊరుకునేది లేదని సంఘాలన్నీ సంఘటితమై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధం కావాలని కోదండరాం పిలుపునిచ్చారు.

Leave a Reply