కనకదుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే

ఇంద్రకీలాద్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు..
కేంద్రమంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు..
( ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను కేంద్ర కార్మిక, ఉపాధి, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి దేవస్థానం ఈవో, అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం కొండపైకి చేరుకున్న మంత్రి కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు కేంద్ర మంత్రికి వేదాశీర్వచనం చేయగా ప్రధాన ఆలయ సూపర్నెంట్ చందు శ్రీను అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని దేవస్థానం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు వివరించగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ నిర్వహణ, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
