ఇంద్రకీలాద్రిపై పంచాంగ శ్రవణం

ఇంద్రకీలాద్రిపై పంచాంగ శ్రవణం
శ్రీ పరాభవ నామ సంవత్సరానికి ఆధ్యాత్మిక శ్రీకారం
వేదోచ్చారణల మధ్య వైభవంగా కార్యక్రమం
ద్వాదశ రాశుల ఫలితాల వివరణ
దాత దంపతులకు ఘన సత్కారం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ‘శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. శక్తిస్వరూపిణి కనకదుర్గమ్మ సన్నిధిలో నూతన పూజా మండపం ప్రాంగణంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుక భక్తి పరవశాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆలయ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ చల్ల శ్రీనివాస శర్మ పంచాంగ పఠనం నిర్వహించి, నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కలిగే ఆదాయ-వ్యయాలు, రాజపూజ్య-అవమానాలు, గ్రహగతులు వంటి అంశాలను విశదీకరించారు.

అదేవిధంగా వర్షపాతం, వ్యవసాయ పరిస్థితులు, దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజల ఆరోగ్యంపై గ్రహాల ప్రభావాన్ని క్షుణ్ణంగా వివరించారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు సిద్ధాంతి గారి ప్రవచనాన్ని ఆసక్తిగా ఆలకించారు. పంచాంగ శ్రవణం అనంతరం భక్తులకు దేవస్థానం తరఫున పంచాంగాలను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే ఉగాది పచ్చడి, ప్రసాదాలను అందజేశారు.
కార్యక్రమం ముగింపులో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో శీనా నాయక్ పంచాంగకర్తను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఈవో తెలిపారు.
దాతకు ఘన సత్కారం..

దేవస్థానంలో శివాలయం, యాగశాల నిర్మాణానికి సహకరించిన దాత సంఘ నరసింహ రావు దంపతులను ఉగాది సందర్భంగా ఘనంగా సత్కరించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్, ధర్మకర్తలు కలిసి వారికి నూతన వస్త్రాలు, అమ్మవారి పటం, ప్రసాదాలు అందజేశారు. ఇంద్రకీల క్షేత్ర అభివృద్ధికి వారు చేసిన సేవలను కొనియాడారు.
