వైజాగ్ : ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ ఎడిషన్‌లో యు ముంబా వరుసగా రెండో విజయం సాధించింది. తొలి పోరులో టై బ్రేక్‌లో గుజరాత్ జెయింట్స్ పని పట్టిన ముంబా వైజాగ్‌లోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 36–33తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది.
ఓ దశలో 8 పాయింట్ల వెనుకంజలో నిలిచిన ముంబా చివరి పది నిమిషాల్లో అద్భుత ఆటతో విజయం అందుకుంది. ముంబా జట్టులో రైడర్ అజిత్ చౌహాన్ 9 పాయింట్లు, ఆల్‌రౌండర్ అనిల్ 8 పాయింట్లతో సత్తా చాటారు. తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ (12 పాయింట్లు) సూపర్ టెన్, కెప్టెన్ పవన్ సెహ్రావత్ (7) ఆకట్టుకున్నా.. చివరి నిమిషాల్లో తడబడి ఓడిపోయింది.
మ్యాచ్ ప్రారంభంలోనే యు ముంబా రైడర్ అజిత్ చౌహాన్ రివర్స్ టో-టచ్‌తో మొదటి పాయింట్ సాధించి ముంబా ఖాతా తెరిచాడు. అయితే వెంటనే నితీష్ యాంకిల్ హోల్డ్‌తో రోహిత్‌ను ట్యాకిల్ చేయడంతో తమిళ్ తలైవాస్ మొదటి పాయింట్‌ను నమోదు చేసింది.
ఆ తర్వాత అర్జున్ దేశ్వాల్ 3-3తో సమం చేశాడు. ఆశీష్ పట్టుదలగా అజిత్ చౌహాన్‌ను అడ్డుకోవడంతో తలైవాస్ 6-4 ఆధిక్యంలోకి వచ్చింది. అయితే డూ ఆర్ డై రైడ్‌లో తలైవాస్ కెప్టెన్ పవన్ సెహ్రావత్‌ను ముంబా డిఫెండర్లు నిలువరించడంతో స్కోరు 7-7తో సమమైంది. అనిల్ డూ ఆర్ డై రైడ్‌లో ఆశీష్ పట్టు నుంచి చాకచక్యంగా తప్పించుకుని మిడ్ లైన్ తాకడంతో ముంబా ఆటలోకి తిరిగి వచ్చింది.
కానీ, అజిత్ చౌహాన్‌ను డిఫెండర్లంతా సమష్టింగా నిలువరించడంతో తలైవాస్ 9–7తో తిరిగి ఆధిక్యం అందుకుంది. ముంబా కోర్టులో అనిల్ మాత్రమే మిగిలిపోయాడు. ఈ దశలో అతను బోనస్, టచ్ సహా రెండు పాయింట్లు రాబట్టడంతో ముంబా పుంజుకునే ప్రయత్నం చేసింది.
చివరకు అనిల్‌ను ట్యాకిల్ చేసిన తలైవాస్ 14–11తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది. మొదటి 20 నిమిషాల్లో తమిళ్ తలైవాస్ డిఫెండర్లు అజిత్ చౌహాన్‌ను సమర్థవంతంగా కట్టడి చేయగా, అర్జున్ దేశ్వాల్ 7 పాయింట్లతో తమిళ జట్టుకు నాయకత్వం వహించి ఆధిక్యంలో ఉంచాడు.
రెండో అర్ధభాగం మొదలైన వెంటనే ముంబాను ఆలౌట్ చేసిన తలైవాస్ తన ఆధిక్యాన్ని ఆరు పాయింట్లకు పెంచుకుంది. తమిళ జట్టు తన ఆధిక్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగా.. ముంబై క్రమం తప్పకుండా పాయింట్లు సాధిస్తూ పోటీకి వచ్చే యత్నం చేసింది.
ఈ క్రమంలో తలైవాస్ కెప్టెన్ సెహ్రావత్‌ను రెండుసార్లు నిలువరించింది. కానీ, తమిళ జట్టు డిఫెండర్ హిమాన్షు.. అనిల్‌ను ట్యాకిల్ చేయగా.. సూపర్ టెన్ సాధించిన వెంటనే అర్జున్ ఔట్ అయ్యాడు. ఆపై పవన్ బోనస్ సహా రెండు పాయింట్ల రైడ్ చేయడంతో తలైవాస్ 26–18తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది.
కోర్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగలడంతో ముంబా మరోసారి ఆలౌట్ ప్రమాదంలో నిలిచింది. కానీ, ముంబా ఆటగాడు అజిత్.. తలైవాస్ కెప్టెన్‌ను సూపర్ ట్యాకిల్ చేయడంతో ముంబా శిబిరంలో ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరిగింది. వెంటనే అజిత్ రైడ్ పాయింట్ కూడా రాబట్టగా.. డిఫెండర్లు, రైడర్లు జోరు పెంచడంతో ముంబా 28–28తో స్కోరు సమం చేసింది.
కోర్టులో మిగిలిన నరేందర్ ఖండోలాను కూడా ట్యాకిల్ చేసిన ముంబా 36వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 31–29తో ఆధిక్యంలోకి వచ్చింది. అజిత్ బోనస్ రాబట్టగా.. పవన్ లాబీలోకి వెళ్లడంతో చివరి నిమిషంలో ముంబా 34–32తో రెండు పాయింట్ల ఆధిక్యంతో నిలిచింది. ఆఖరి క్షణాల్లోనూ మెరుగ్గా ఆడి విజయం అందుకుంది.