Two-wheeler | ద్విచక్ర వాహనంపై మృతదేహం రవాణా

Two-wheeler | ద్విచక్ర వాహనంపై మృతదేహం రవాణా
Two-wheeler | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : డబ్బులు లేని కారణంగా మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తరలించిన ఘటన మంగళవారం బాపట్లలో చోటు చేసుకుంది. నియోజకవర్గంలోని కర్లపాలెం మండలం చింతయపాలెం పంచాయితీ రాళ్ల చెరువు గ్రామానికి చెందిన నక్క నాగేశ్వరరావుకు గుండెపోటు రావడంతో వారి కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. రోగిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఆటో డ్రైవర్లను సంప్రదించగా 3000 పైచీలకు అడగడంతో డబ్బుల్లేని కారణంగా ద్విచక్ర వాహనంపై మధ్యలో కూర్చోబెట్టుకొని మృతదేహాన్ని తీసుకువెళ్లారు. పేదలకు ఏ ఆపద వచ్చినా మేము ముందు ఉంటాం అనే స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకులు సంఘసంస్కర్తలకు హృదయ విధారకర సంఘటనలు వారికి కానరావా అంటూ సంఘటన చూసిన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పుట్టిన బిడ్డను క్షేమంగా ఇంటికి తరలించేందుకు తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ను ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. మరి కాలం చెల్లిన నిరుపేదల మృతదేహాం రవాణాకు మహాప్రస్థానం వాహనాలు ఏర్పాటు చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. పలు జిల్లా కేంద్రాలలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మృతదేహాలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు, బాపట్ల జిల్లా కేంద్రంలో అట్టి ఉదారత చాటుకునే సంస్థలు లేకపోవడం విచారకరం.
