తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో ( రాయలసీమ) : ఎన్నో ఏళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ అధికారులు అన్నమయ్య జిల్లాలో అరెస్టు చేసారు.
అన్నమయ్య జిల్లా పరిధిలో పక్కా సమాచారంతో మాటువేసిన తమిళనాడుకు చెందిన ఏటీఎస్ సిబ్బంది ఉగ్రవాదులైన అబూబక్కర్ సిద్దీక్క్ (నాగూర్), మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ (మేళపాలయం) అనే ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసారు. ఈరోజు వారిని తమిళనాడులోని స్పెషల్ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరిచినట్టు తెలుస్తోంది.
పట్టుబడిన ఇద్దరిలో 30 ఏళ్ల నుంచి పరారీలో ఉన్న సిద్దీక్ 1995లో చెన్నై చింతాద్రిపేటలో హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు పేలుడు, నాగూరులో పార్శిల్ బాంబు పేలుడు, 1999లో చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, కేరళలో 7 చోట్ల బాంబులు పెట్టడం, 2011లో మధురైలో ఎల్.కె.అద్వానీ రథయాత్ర సమయంలో పైప్ బాంబు, 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య, 2013లో బెంగళూరు మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు.
ఇక పాతికే ళ్లకు పైగా పరారీ లో ఉన్న మొహమ్మద్ అలీ 1999లో తమిళనాడు, కేరళలో బాంబు ఉంచే ఘటనల్లో నిందితుడుగా ఉన్నాడు.