ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపావరంకు చెందిన సాయిపవణ్, శరత్ కుమార్ 5వ తరగతి చదువుతున్నారు. ఒంటిపూట బడులు కావడంతో పాఠశాల అయ్యాక కాలువలో స్నానానికి దిగిననారు. శనివారం మధ్యాహ్నం సాయి పవణ్, శరత్ కుమార్ ఇద్దరు కలిసి పాతవయ్యేరు కాలువలో ఈతకు వెళ్లారు. ఇద్దరికి ఈత రాకపోయినా నీటి ప్రవాహంలోకి దిగారు. కాలువలో నీటి ఉధృతి కారణంగా నీటమునిగి మృత్యువాత పడ్డారు.
స్థానికులు చూసి బయటకి తీయగా.. అప్పటికే ఇద్దరూ మృతిచెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరున్నారు. అనంతరం ప్రమాదం గురించి స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆకివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరు విద్యార్థులు ఒక్కసారి మృతి చెందడంతో చినకాపావరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.