ఫాల్కన్ కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ అధికారులు మరో ఇద్దరి నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక పాత్ర వహించిన రబీంద్ర ప్రసాద్, సుష్మారాజ్‌లను బిహార్‌లో అరెస్టు చేసి వారిని పీటీ వారెంట్‌పై వారిని హైదరాబాద్ తరలించారు.
ఈక్రమంలో నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ రిమాండ్‌కు విధించడంతో జైలు తరలించారు. తాజాగా అరెస్టయిన ఇద్దరు నిందితులు పాల్కన్ కేసులో ఏ2గా ఉన్న అమర్‌దీప్ కుటుంబ సభ్యులుగా సీఐడీ అధికారులు విచారణలో తేలింది.
వీరిద్దరూ ఫాల్కన్ కుంభకోణంలో చురుగ్గా వ్యవహరించి వేలాది కోట్ల రూపాయాలు దారి మళ్లించినట్లు సీఐడీ గుర్తించింది. నిందితుల నుంచి రూ.8 లక్ష నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఆభరణాలు, బ్యాంక్ కార్డులు, 9 సెల్‌ఫోన్‌లు, రెండు లాప్‌ట్యాప్‌లతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా ఈ కేసులో నిందితులు కొనుగోలు చేసిన మరిన్ని ఆస్తులను సీఐడీ గుర్తించింది. పాల్కన్ సంస్థ 4,065 మంది బాధితులకు రూ.792 కోట్లు చెల్లించకుండా మోసం చేసినట్లు సీఐడీ అధికారుల విచారణలో తేలింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యోగేంద్రసింగ్‌ను సీఐడీ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం విదితమే. మరోవైపు ఫాల్కన్ వైస్ ప్రెసిడెంట్ పవన్‌కుమార్ ఓదెల, డైరెక్టర్ కావ్య నల్లూరి ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నారు.
సామాన్యులకు అధిక లాభాలు ఆశ చూపి 7056 మంది నుంచి సుమారు రూ.4,215 కోట్లు వసూలు చేసినట్లు ఫాల్కన్ సంస్థపై ఉన్న ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు చేపడుతోంది.