ఒకరికి కొడుకు… మరొకరికి తండ్రి…

  • విద్యుదాఘాతంతో రెండు కుటుంబాల్లో విషాధచాయలు
  • కాకినాడ జిల్లాలో మృతి చెందిన ఇరగవరం వాసులు
  • ఇరగవరం మండలంలో అలముకున్న విషాదఛాయలు

తణుకు, (ఆంధ్రప్రభ): ఆ ఇంటికి ఉన్న ఏకైక వారసుడు… చేతికి అంది వచ్చాడు… ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న తరుణంలో ఆ కొడుకు చనిపోయాడన్న చేదు వార్త ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. మరోవైపు, జీవితంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంటూ, జీవనయానంలో ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న మరో కుటుంబానికి ఇంటి యజమాని మరణించాడన్న నిజం జీర్ణించుకోలేక శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇరగవరం మండలం రాపాకాలో కొడుకును కోల్పోయి ఒకరు, పేకేరులో ఇంటి యజమానిని కోల్పోయి మరోక కుటుంబం కన్నీరు మున్నీరవుతున్నారు.

వివరాల్లోకి వెళితే ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన కరిపెద్ధి సింహాద్రి అప్పన్న (53) వరికోత యంత్రాలతో ఆయా ప్రాంతాలకు తిరుగుతూ కోతలు కోయిస్తూ జీవనంసాగిస్తుంటారు. అయితే అదే మండలానికి చెందిన గెడ్డం సందీప్ (20) గత కొద్ది నెలల నుంచి సింహాద్రి వద్ద వరికోత యంత్ర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

ఈ నేపధ్యంలో కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాల్లో కోతలు కోసేందుకు ఆదివారం బయలుదేరారు. ఈ క్రమంలో గండేపల్లి మండలం రామయ్యపాలెం వద్ద వారి వాహనానికి విద్యుత్తు తీగలు అడ్డువస్తున్నాయని వాటిని తప్పించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే సింహాద్రి అప్పన్న, సందీప్ మృతిచెందారు. ఒకరు కొడుకును, మరొకరు తండ్రిని కోల్పోయిన ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఉదయం సింహాద్రి అప్పన్న, సందీప్ మరణ వార్త వినగానే ఆయా గ్రామాలు శోక సంద్రాల్లో మునిగాయి.

ఒకరికి కొడుకు… మరొకరికి తండ్రి…

Leave a Reply