టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి

టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి

భవానిపురం, ఆంధ్రప్రభ : టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు , మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో బి.ఆర్ నాయుడుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో హిందూ సమాజం తీవ్ర ఆందోళనకు గురైందన్నారు.

ఇటువంటి వివాదాస్పద పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా కొనసాగించడం సరైంది కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. నిజంగా శ్రీవారిపై భక్తి భావం ఉంటే ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎస్వీబీసీ భక్తి ఛానల్‌కు సంబంధించిన వివాదంలో వెంటనే చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఎలాంటి అపరాధ భావం లేకుండా వైఎస్సార్ సీపీపై నిందలు మోపడం అనైతికమన్నారు.

ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకు మద్దతుగా సమావేశాలు నిర్వహించిన స్వామీజీలు ఈ అంశంపై స్పందించాలని కోరారు. బి.ఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయ పవిత్రత దెబ్బతినేలా వ్యవహారాలు జరుగుతున్నాయని పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావించారు. 70 ఏళ్ల వయస్సులో ఉన్న చైర్మన్‌కు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు.

Leave a Reply