- భారత్‌పై సుంకాలు తగ్గించనున్న అమెరికా
- హెచ్ 1 బీ పెద్దన్న స్వరం మారింది.
- అమెరికాకు విదేశీ ప్రతిభావంతులు అవసరమన్న అధ్యక్షుడు
trump H1B| వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నిన్నా, మొన్నా నియంతలా వ్యవహరిస్తూ, టారిఫ్‌లు పెంచుకుపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తలొగ్గారు. కారణాలు ఏవైనా, భారత్ విషయంలో ట్రంప్ (Trumo) తగ్గినట్టేనని చెప్పొచ్చు. అమెరికాకు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న సుంకాలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. అలాగే హెచ్1బీ విషయంలోనూ సర్వం మార్చారు. అమెరికాకు విదేశీ ప్రతిభావంతులు అవసరమని ఇప్పటికైనా గుర్తించారు. భారతదేశం రష్యన్ ముడి చమురు దిగుమతిని గణనీయంగా నిలిపివేసిందని పేర్కొంటూ, ఇప్పుడు న్యాయమైన వాణిజ్య ఒప్పందం వైపుకు ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయని మూడు రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడం తెలిసిందే. వీటికి తోడు న్యూయార్క్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం, షట్‌డౌన్ ఎత్తివేతలో రిపబ్లికన్లకు డెమాక్రాట్ లు సహకరించడం, హెచ్1బీ వీసా సంస్కరణలతో అమెరికాకు కొత్తగా వచ్చే పరిశ్రమలు తగ్గిపోవచ్చు అనే అభిప్రాయాలను చాంబర్ ఆఫ్ కామర్స్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా వ్యతిరేకించడం ఇలా అనేక కారణాలు చెప్పొచ్చు.

ఇదే ప్రధాన కారణమా?
రష్యాతో భారతదేశం చేస్తున్న చమురు వ్యాపారం కారణంగా అమెరికా విధించిన అధిక సుంకాలు ఇక తగ్గవచ్చని మూడు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతం ఇచ్చారు. ఆగస్టులో అమెరికా, భారత దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం రష్యాపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమని వైట్ హౌస్ అప్పట్లో ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్న నేపథ్యంలో భారతదేశం రష్యా చమురు కొనుగోలును తగ్గించాలనే ఒత్తిడి వాషింగ్టన్ నుంచి వచ్చింది.

ఇప్పుడు భారతదేశం రష్యాతో చమురు దిగుమతులను తగ్గించిందనే సంకేతాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు సుంకాల సడలింపుకు మార్గం సుగమం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య చర్చలపై మాట్లాడిన ట్రంప్ తాము భారతదేశంతో గతంలో ఉన్న దానికంటే భిన్నమైన ఒప్పందం కుదుర్చుకుంటున్నామని తెలిపారు. భారత్-అమెరికా మధ్య న్యాయమైన వాణిజ్య ఒప్పందం కుదురుతోందన్నారు. ఇది ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు సమతుల్యంగా మారతాయని అమెరికా అభిప్రాయం కూడా!
సుంకం తగ్గిస్తే…
అమెరికా సుంకాలను తగ్గిస్తే, భారతదేశం తన ఉత్పత్తులను అమెరికా మార్కెట్‌కు మరింత విస్తరించే అవకాశం ఉంది. అదే సమయంలో అమెరికా కంపెనీలకు భారత మార్కెట్లో పెట్టుబడులకు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. అమెరికా పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, అమెరికన్ ఎనర్జీ ఎగుమతులను పెంచడానికి, భద్రతా సహకారాన్ని విస్తరించడానికి అవకాశం కలుగుతుంది.
హెచ్1బీ వీసాపై స్వరం మార్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా(HV1B Visa) సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. అమెరికా శ్రామిక శక్తిలో కీలక స్థానాలను భర్తీ చేయడానికి ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అవసరమేనన్నారు. తమ వద్ద అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని అంగీకరించారు.
అయితే అమెరికాకు చెందిన ఉద్యోగులు బయట నుంచి వచ్చే వారి దగ్గర నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. సరైన శిక్షణ లేకుండా తయారీ, రక్షణ రంగాల్లోని ముఖ్యమైన స్థానాల్లో నిరుద్యోగ అమెరికన్లను నియమించుకోలేమన్నారు. రక్షణ రంగానికి చెందిన జార్జియాలోని ఓ ఫ్యాక్టరీ నుంచి పెద్ద మొత్తంలో విదేశీ కార్మికులను తొలగించడం వల్ల కొన్ని ముఖ్యమైన ఉత్పత్తుల తయారీలో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు ట్రంప్ ఉదహరించారు.
అమెరికన్ కార్మికుల వేతనాలను పెంచడానికి తాను మద్దతిస్తున్నప్పటికీ, దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే విదేశీ ప్రతిభను ఉపయోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హెచ్1బీపై అమెరికార అధ్యక్షుడు స్వరం మార్చారు.
ఇది కూడా చదవండి ముగింపు దశలో షట్‌డౌన్

