సత్యమేవ జయతే…

”సత్యంవద, ధర్మంచర” సత్యం పలకండి, ధర్మాన్ని ఆచరించండి, అంటున్నది భారతీయ సంస్కృతి. సత్యమనేది ”సత్‌ తి యం” అనే ధాతువుల సమ్మేళనంగా చెప్పుకోవచ్చు. ”సత్‌” అనేది శాశ్వతమైనది, మార్పులేనిది.. ”ఆత్మ” కాగా ”తి” అనేది మార్పుకు లోనయ్యేది.. ”ప్రకృతి”. ”యం” అనేది ఈ రెంటినీ నియంత్రించేది. సృష్టి స్థితి లయాలకు ఆలవాలమైన జగత్తుకు అతీతమైన పరబ్రహ్మ తత్త్వాన్ని తెలిపేది ”సత్యం”. ”సతి సాదు భవేత్‌” సత్యం అన్నారు. జగత్తంతా ఏదయితే ఉన్నదో దానినే సత్యము అంటారు. సత్యంతో పాటుగా చెప్పబడే ”ఋతము” అనగా సత్యం ఆధారంగా ఏర్పడిన ప్రాకృతిక నియమము. తాత్త్వికంగా సత్యమనేది వాక్కు ద్వారా ఉచ్చరించిన బ్రహ్మతత్త్వము కాగా ఋతము మానసికంగా చక్కగా భావించబడిన బ్రహ్మతత్త్వము. ఋతమనేది వ్యావహారిక సత్యము. సత్యమనేది పారమార్ధిక సత్యము. సూర్యుడు ప్రతిరోజూ తూర్పున ఉదయించి పడమట అస్తమిస్తాడు. ఇది వ్యావహారిక సత్యము. సూర్యునికి ఉదయాస్తమానాలు లేవు ఇది పారమార్ధిక సత్యం. ప్రాకృతిక స్పందనల ద్వారా పొందిన విజ్ఞానం ధర్మాచరణకు దోహదపడితే సత్య దర్శనమౌతుంది. అహింస, సత్యం, స్వచ్ఛత, ఇతరుల సంపదను ఆశించకుండుట, శుద్ధత, ఇంద్రియ నిగ్రహణ ఇవన్నీ ధర్మవర్తనకు ప్రాతిపదికగా చెప్పబడ్డాయి. సత్యం ధర్మవర్తనకు ప్రాధమిక సిద్ధాంతం. సత్యమార్గం ప్రతివ్యక్తికీ అనివార్యంగా పాటించదగినది. సత్యం ధర్మం పరస్పరాధారితాలు. ఒకే నాణానికి రెండుముఖాలుగా చెప్పుకోవచ్చు. నాణంలో ఒకవైపు దాని విలువ ముద్రితమై ఉంటుంది. దానినే సత్యం అంటాము. దాని విలువ మారదు. నాణానికి వెనుకవైపు వేరువేరు భావనలు ముద్రితమై ఉండవచ్చు. వాటిని ధర్మం అంటారు. దేశకాలాలను అనుసరించి అవి మారవచ్చు. నిజానికి ఈ రెండూ.. రెండు ముఖాలపై ముద్రితమైతేనే ఆ నాణం చెల్లుబాటవుతుంది.
సాధారణంగా వాస్తవము, నిజము, సత్యము అంటూ ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు. కాని వాటి మధ్య భేదమున్నది. నామరూప భేదాలు కలిగి వస్తుగతమైనది వాస్తవము. నామరూపాలు కలిగినది అశాశ్వతమైనది కాబట్టి ”వాస్తవము” సత్యంకాదు. నలుగురు ఒప్పుకున్నది నిజము. వాదనా పటిమతో నలుగురిని ఇప్పుడొప్పించవచ్చు. కాలక్రమేణా మరొకరు దానిని ఖండించవచ్చు. కాబట్టి ”నిజమూ” అశాశ్వతమే. ఏదైతే సర్వజనీనమై, సార్వకాలికమై నిలుస్తుందో దానినే ”సత్యము” అంటారు. ”వదేత్‌ సత్యం, నచానతం వదేత్‌” సత్యమే పలకండి అసతాన్ని పలకకండి.. నభ్రూయాత్‌ సత్యమప్రియం.. సత్యాన్నైనా అప్రియంగా చెప్పకండి అంటుంది భారతీయ సంప్రదాయం. సత్యాన్ని ప్రియంగా చెప్పడమే ఋతం. సత్యమే జీవనంగా జీవించే మనం మాట్లాడేదానికి ప్రయోజనం ఉండాలి. వ్యక్తినడతలో ప్రతిబింబించే సత్యమూ.. వ్యక్తి జ్ఞానంలో భాసించే సత్యమూ రెండూ వేరువేరుగా ఉంటే అతనిది సత్యవర్తనగా స్వీకరించలేము. వ్యక్తి ఆలోచనలో, పలుకులో, ఆచరణలో సత్యమే ప్రకాశించాలి. సత్యవర్తనుడైన వ్యక్తి ఏనాడు తప్పుచేయడు. కాని మన అవసరాలకోసం, మనకు అనుకూలమైన అంశాలను మాత్రమే.. అవీ న్యాయబద్ధం కాకపోయినా మాట్లాడడం చాలామందికి అలవాటు. దానినే అవకాశవాదం లేదా ”చెర్రీ పికింగ్‌” అంటారు. సత్యవాదిగా నిలవాలంటే బలమైన ఇఛ్ఛ లేదా కోరిక ఉండాలి. సత్యాన్ని వ్రతంగా నియమంగా స్వీకరించాలి. రామాయణంలో దశరధుడు రామునికి పట్టాభిషేకమని రాత్రివేళ చెప్పాడు. ఉదయమే అరణ్యవాసమని కైకేయి చెప్పింది. తండ్రిమాటను జవదాటననే ప్రతిజ్ఞను చేసిన రాముడు రాజ్యభోగాలను వదిలి అరణ్యానికి వెళ్ళాడు దానినే సత్యవ్రతంగా చెప్పుకోవచ్చు. ఇచ్చిన మాటను నిలుపుకోవడమే ప్రతిజ్ఞాపాలన. సత్యధర్మాలు ఊపిరులుగా జీవించిన ఆదర్శమూర్తి శ్రీరాముడు భారతజాతికి ఆదర్శపురుషుడు.

  • పాలకుర్తి రామమూర్తి

Leave a Reply