ట్రైబల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల ఆకస్మిక తనిఖీ

ట్రైబల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల ఆకస్మిక తనిఖీ

  • మైనర్ బాలికతో వంట పనులు చేయించడంపై ఆగ్రహం
  • కళాశాల ప్రిన్సిపాల్‌కు వివరణ కోరుతూ నోటీసు
  • సదరు బాలికను పాఠశాలలో చేర్పించాలని ఆదేశం

నిజామాబాద్, స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని వంటగది, భోజనశాలను పరిశీలించి నిర్వహణ తీరును నిశితంగా గమనించారు. విద్యార్థినుల కోసం వండిన అన్నం, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను కూడా పరిశీలించారు. వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేనిపక్షంలో ఈగలు, దోమలు పెరిగి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా వంటగదిలో 16 సంవత్సరాల మైనర్ బాలిక పనులు చేస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ ఆమె వివరాలు తెలుసుకున్నారు. తన పెద్దమ్మతో కలిసి కొన్ని రోజులుగా వంట పనుల్లో సహాయం చేస్తున్నానని బాలిక తెలిపింది. దీంతో కళాశాల నిర్వహణపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకునే వయస్సులో ఉన్న బాలికతో ప్రభుత్వ విద్యా సంస్థలో పనులు చేయించడం తగదని నిర్వాహకులను ప్రశ్నించారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ సయ్యదా జైనబ్‌కు వివరణ కోరుతూ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బాలికను సమీపంలోని పాఠశాలలో చేర్పించి ఉచిత విద్య, వసతి సదుపాయాలు కల్పించేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

చక్కగా చదువుకోవాలని, ప్రభుత్వం అవసరమైన సహాయం అందిస్తుందని బాలికకు భరోసా కల్పించారు. అనంతరం డిగ్రీ విద్యార్థినులతో కొద్దిసేపు మాట్లాడిన కలెక్టర్, ఉన్నత విద్యను పూర్తి చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదువును మధ్యలో ఆపకుండా కష్టపడి చదవాలని విద్యార్థినులకు సూచించారు.

Leave a Reply