- 7న తేదీన నమూనా పరీక్ష
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఎర్రన్న విద్యా సంకల్పం లో భాగంగా జవహర్ నవోదయ విద్యాలయాలలో ప్రవేశం కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు డిసెంబర్ 7వ తేదీన నమూనా పరీక్ష నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గురువారం వారు పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. నవోదయ ప్రవేశ ప్రధాన పరీక్షలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు, చిన్న వయస్సులోనే పోటీ పరీక్షలపైన ఉన్న భయాన్ని తొలగించేందుకు ఈ నమూనా పరీక్ష ఉపయోగపడుతుందని వివరించారు.
ఈ నెల 7వ తేదీన శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సమీప ప్రాంతాల్లో ప్రధాన పరీక్షకు తీసిపోని స్థాయిలో అదే సమయ పాలన, ప్రశ్నాపత్ర సరళితో ఈ నమూనా పరీక్ష జరగనుందని తెలిపారు. ఇందుకోసం వైవీసశ్రీకాకుళం. లైవ్/నవోదయ-రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో ముందుగా విద్యార్థులు వారి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ అవ్వాలని అన్నారు.
రిజిస్టర్ అయిన విద్యార్థులు వెబ్ సైట్ నుండి హాల్ టికెట్ పొంది కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో 7వ తేదీ ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు హాజరవ్వాలని, 11:30కు పరీక్ష ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.
ఇందుకోసం శ్రీకాకుళం గొంటి వీధిలో గల విద్యాధరి కళాశాల, పాతపట్నం కోర్టు దగ్గర గల మహేంద్ర జూనియర్ కళాశాల, పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక శివాజీ నగర్ మధర్ థెరిసా విద్యాలయం, టెక్కలిలో శ్రీ విశ్వజ్యోతి డిగ్రీ కళాశాల, సోంపేట పాత ఎస్బిఐ వీధిలో వి.వి.కే శిశు మందిర్ హై స్కూల్ లలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
మరి కొద్ది రోజుల్లో జరగనున్న నవోదయ పాఠశాలల ప్రవేశ పరీక్షకు ఎక్కువ మంది విద్యార్థులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వారి సన్నద్ధతకు మరింత తోడ్పాటు అందించే విధంగా ఈ నమూనా పరీక్షను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని భవిష్యత్ పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

