జనవాసాల మధ్య ట్రాన్స్‌ఫార్మర్లు పేలుడు

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంథన్‌గోడు గ్రామంలో జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. గువ్వల శివరాజ్ ఇంటి పక్కనే సుమారు 10 అడుగుల దూరంలో ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్లు చిన్నపిల్లలు, వృద్ధులు, మూగజీవాలకు ప్రాణహాని కలిగించే పరిస్థితి నెలకొంది.
ఈ ట్రాన్స్‌ఫార్మర్లను ఇతర ప్రాంతానికి మార్చాలని స్థానికులు పలుమార్లు మక్తల్ ఏఈని కలిసి వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఇదిలా ఉండగా, శనివారం ఒక్కసారిగా ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
స్థానిక లైన్‌మన్ కుర్మయ్య నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే తొలగించకపోతే భవిష్యత్తులో ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని, ఎలాంటి ప్రమాదం జరిగినా మక్తల్ ఏఈతో పాటు లైన్‌మన్ కుర్మయ్య పూర్తి బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు.
ఈ ఘటనపై ఆంధ్రప్రభ ప్రతినిధి ఏఈ దృష్టికి తీసుకెళ్లగా, స్థానికుల నుంచి ఇప్పుడే సమాచారం అందిందని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లను తక్షణమే అక్కడి నుంచి తొలగించి ఇతర ప్రదేశంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
