న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :భారత సైన్యం నిఘా సామర్థ్యాలను పెంచడానికి అభివృద్ధి చేస్తున్న స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్ తొలి విమాన పరీక్షలను భారత్ విజయవంతంగా నిర్వహించింది. మధ్యప్రదేశ్‌లోని షియోపుర్‌లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ విమాన పరీక్షను చేపట్టింది. 62 నిమిషాల పాటు నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన దృశ్యాలను DRDO ఎక్స్ మాధ్యమంలో పంచుకుంది.
స్ట్రాటోస్పిరిక్ ఎత్తులలో చాలా కాలం పాటు గాలిలో ఎగరగలిగేలా ఈ ఎయిర్‌షిప్‌ను రూపొందించినట్టు అధికారులు చెప్పారు. గాలి కంటే తేలికైన అధిక-ఎత్తు ప్లాట్‌ఫామ్ వ్యవస్థల సాక్షాత్కారానికి ఈ ప్రోటోటైప్ విమానం ఒక మైలురాయి అని పేర్కొన్నారు.
ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ఇంత సంక్లిష్టమైన వేదికను అభివృద్ధి చేశాయని అధికారులు తెలిపారు.
అభినందించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్..
ఈ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్‌ను దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తుకు ఇన్‌స్ట్రుమెంటల్ పేలోడ్‌తో ప్రయోగించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ విమాన పరీక్ష జరిగింది. ఈ వ్యవస్థ తొలి విమాన పరీక్ష విజయవంతం అయినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవోను అభినందించారు. భారత నిఘా సామర్థ్యాలను ఈ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్ మెరుగుపరుస్తుందని చెప్పారు.