పుంగనూరులో విషాదం..

పుంగనూరులో విషాదం..

పుంగనూరు, ఆంధ్రప్రభ : అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో గుండెల్ని పిండేసే మహా విషాదం చోటుచేసుకుంది. ఒక చిన్నఅజాగ్రత్త పచ్చని సంసారంలో తీరని చీకట్లను నింపింది. పట్టణంలోని త్యాగరాజు వీధికి చెందిన మురళి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి ఇంజిన్ బోర్ చేయించగా, బండి సెట్ అవ్వాలంటే రాత్రంతా స్టార్టింగ్‌లో ఉంచాలని మెకానిక్ సూచించాడు. ఆ మాటను నమ్మి, ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేసి ఇంటి లోపల ఉంచి తలుపులు బిగించుకుని ఆ కుటుంబం నిద్రపోయింది.

అయితే.. రాత్రంతా బండి నుండి వెలువడిన ప్రాణాంతక కార్బన్ మోనాక్సైడ్ ఆ గదిని మృత్యుకుహరంగా మార్చేసింది. ఆ విషవాయువును పీల్చడంతో ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిద్రలోనే అనంత వాయువుల్లో కలిసిపోయారు. ఈ ఘటనలో 70 ఏళ్ల వృద్ధుడు రామచంద్రప్పతో పాటు, 11 ఏళ్ల కార్తీక్, ఎనిమిదేళ్ల కవల పిల్లలు చందన, చరిత మృతి చెందడం స్థానికులను కన్నీరుమున్నీరు చేస్తోంది. లోకం తెలియని పసిబిడ్డలు నిద్రలోనే విగతజీవులుగా పడి ఉండటం చూసి త్యాగరాజు వీధి విషాదంలో మునిగిపోయింది. కేవలం వాహనం ఇంజిన్ కోసం చేసిన ప్రయత్నం, నలుగురి ప్రాణాలను బలి తీసుకోవడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

Leave a Reply