Tourism | ఏపీ నెంబర్ వన్ డెస్టినేషన్..

Tourism | ఏపీ నెంబర్ వన్ డెస్టినేషన్..
Tourism, భవానిపురం, ఆంధ్రప్రభ : సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం, నిరంతర కృషితో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ టూరిజానికి నెంబర్ వన్ డెస్టినేషన్ గా మారుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నదీ తీరాల్లో హౌస్ బోట్స్ టూరిజంకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్న అమరావతి ఆవకాయ్ ఉత్సవాలు గురువారం పున్నమి ఘాట్ లో ఘనంగా ప్రారంభం అయ్యాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అంబాసిడర్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ హెచ్.ఈ. హర్వే డెలిఫిన్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఏపీ టి.డి.సి చైర్మన్ నూకసాని బాలాజీ, కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ పొడపాటి తేజస్వీ, టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎం.డి అమ్రపాలిలతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అమరావతి ఆవకాయ్ ఉత్సవాలు జనవరి 8 నుంచి 10 వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి.

ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. ఆంద్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంగా అమరావతి రాజధాని, అభివృద్ది, సంక్షేమంతో పాటు సినిమా రంగం, సాంస్కృతిక కళలు, సాహిత్యం అభివృద్ది చెందాలనే సీఎం చంద్రబాబు కలల రూపం అమరావతి – ఆవకాయ ఉత్సవాలు అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల అభివృద్దిలోనే కాదు ఇతర రాష్ట్రాలతో కూడా పోటీపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీనే కాకుండా సాంస్కతిక కళలను పోషిస్తున్నట్లు వివరించారు. విజయవాడలో సినిమా పరిశ్రమ ఎప్పటి నుంచో అభివృద్ది చెంది వుందన్నారు. రాష్ట్ర మొత్తం ఉత్సవాలు నిర్వహించేందుకు ఒక సర్క్యూట్ టూరిజం అభివృద్ది చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
సర్క్యూలేషన్ మనీ వుండాలంటే టూరిజం ఒక్కటే మార్గమని 20 ఏళ్ల క్రితమే సీఎం చంద్రబాబు హైదరాబాద్ అభివృద్దిలో విజయవంతంగా నిరూపించారని గుర్తు చేశారు. వైజాగ్ లో బీచ్ పెస్టివల్, ఈ ప్రాంతంలో విజయవాడ ఉత్సవ్ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయించి ప్రతినియోజకవర్గంలో కళలు, కళాకారులను ప్రోత్సహిస్తున్నందుకు సీఎం చంద్రబాబు కు ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం రైతుల సంక్షేమం, అభివృద్ది కోరుకునే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తిరిగి కృష్ణ మ్మ జలహారతి ప్రారంభంకావటం ఎంతో ఆనందంగా వుందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ ఇతర ప్రజాపత్రినిధులతో కలిసి సీఎం చంద్రబాబుకు వీడ్కోలు పలికారు.
