Top Story | గుట్టలపై గూళ్లు రెడీ – ఊళ్లు ఖాళీ చేస్తున్న గిరిజనం

సురక్షిత ప్రాంతాలకు ముంపు వాసులు

  • 2022 వరదల గుణపాఠం
  • అందుకే ముందస్తు జాగ్రత్తలు
  • అద్దె ఇళ్లకూ పెరిగిన‌ డిమాండు
  • అదనపు భారంతో అవస్థలు
  • ఇవీ మన్యంలో వాన కష్టాలు

ఆంధ్రప్రభ, చింతూరు: (Andhra Prabha , Chintoor )
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం. చింతూరు ఐటీడీఏ పరిధిలోని మన్యం వాసుల Manyam ) పరిస్థితి ఏమున్నదక్కో.. ఏమున్నదక్క ముల్లె సర్దుకున్నా.. వెళ్ళి పోతావున్న ఈ ఊళ్లో నాకు ఏమున్నదక్కో అని ప్రతి ఏడాది కుమిలిపోయే దుస్థితి దాపురిస్తోంది. వానా కాలం (rainy season ) వచ్చిందంటే మన్యం వాసుల్లో వణుకు పుడుతోంది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం పుణ్యమాని ఈ అయిదారేళ్ళలో వరదల ప్రభావం ఈ మండలాల ప్రజల కంటిమీద కునుకు లేకండా చేస్తోంది. ఈ వరదల ప్రభావంతో మన్యంలోని ముంపు ప్రాంతాల వాసులు గత 2022 వరదల గుణపాఠంతో ముందస్తుగానే ఊళ్లను ఖాళీ చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.

గుట్టలపైనే.. ఆవాసాలు

మన్యంలో జూన్‌ నెల ప్రారంభం నుండే వరదల భయం పట్టుకుంటుంది. ఈ భయంతో వరద ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలు వరద భారీ నుంచి తప్పించుకుని తలదాచుకునేందుకు గుట్టలపై గూళ్ళ్లు కట్టుకునేందుకు సిద్ద పడుతున్నారు. చింతూరు మన్యంలోని చింతూరు, వీఆర్‌ పురం, కూనవరం మండలాల్లోని లోతట్టు ప్రాంతాల గిరి జనం వరద భయంతో తమ గ్రామాలకు దగ్గరలోని గుట్టలపై గూళ్ళు కట్టుకోవడం ప్రారంభించారు. జూలై మొదలుకొని ఆక్టోబర్‌ మొదటి వారం వరకు ఆ గుట్టలపై ఆవాసాల్లో సహవాసం చేస్తూంటారు.

వరద భయంతోనే …

వర్షకాలం వచ్చిందంటే వరద పోటు తప్పదనే భయం మన్యం ప్రాంత వాసుల్లో గూడు కట్టుకుంది. ఆ భయంతో వరద కష్టం రాకముందే తట్టా, బుట్టా సర్ధుకొని సురక్షిత ప్రాంతాలకు కదిలిపోతున్నారు. 2022 వరదలు మన్యం వాసులను మరింత వణికించాయి. 1986 తరువాత అంతటి వరద 2022లోనే వచ్చిందనే వాదనలు ఉన్నాయి. ఈ 2022 వరదల్లో ముంపు మండలాల వాసులు నిండా మునిగి కష్టపడి సంపాందించుకున్నదంతా ఈ వరదల్లో నష్టపోయారు. అదే భయంతో ఈ మూడు సంవత్సరాల నుంచి ప్రజలు ముందస్తు జాగ్రత్తలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నారు. చింతూరు గ్రామానికి చెందిన ప్రజలు ఎర్రంపేట, వీఆర్‌ పురం గ్రామానికి చెందిన ప్రజలు రేఖపల్లి, కూనవరం, టేకులబోరు గ్రామాలకు చెందిన ప్రజలు భీమవరం, కోతులగుట్ట వంటి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

అద్దెల మద్దెల ..

చింతూరు మన్యంలో వరదలు ప్రజల పాలిట శాపంగా మారాయి. ఒకపక్క వరదలతో అవస్థలు పడే ప్రజలు మరో పక్క అద్దెల రూపంలో అదనపు భారంతో సతమతవుతున్నారు. వరద భయంతో సురక్షిత గ్రామాల్లో ఇల్లు అద్దెలకు తీసుకొని వరదలు సీజన్‌ పోయేంతవరకు మూడు, నాలుగు నెలల పాటు అద్దెలు చెల్లించుకుంటూ అదనపు భారంతో అవస్థలు పడుతున్నారు. ఈ అద్దెలు రూ. 5 వేల నుంచి పైబడే ఉండటంతో మరింత క్షోభకు గురవుతున్నారు. ఒక పక్క వరదల సమయంలో పనులు లేక మరో పక్క అదనపు అద్దెలు చెల్లించలేక బ్రతుకు జీవుడా అని కాలం వెల్లబుచ్చుతున్నారు. ఈ అద్దెల విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అధిక అద్దెలపై నియంత్రణ పెట్టి వరద బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు.

ప్రతి ఏడాది కష్టాలు నష్టాలే !

ఈ వరదలతో ప్రతి ఏడాది కష్టాలు, నష్టాలు చవి చూడాల్సి వస్తోందని ముంపు మండలాల వాసులు ఆవేదన చెందుతున్నారు. ఏదో 5 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకో ఒక్కసారి వరదలు వస్తేనే ఆ నష్టం పూడ్చుకోలేనిది ప్రతి ఏడాది వరదలు రావడం వలన ఏడాంత కష్టపడి సంపాదించింతా ఈ వరదల సమయంలో ఏమి మిగలడం లేదని వాపోతున్నారు. ఏజెన్సీ వాసులకు ప్రతి ఏడాది ఈ వరదలు కష్టాలు తెచ్చి పెట్టి నష్టాలను మిగుల్చుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం నిర్మాణంతోనే ఈ కష్ట నష్టాలు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది వరదలు మన్యం వాసులను ఏమి చేస్తాయోనని కంటి మీద కునుకు లేకుండా క్షణం ఒక యుగంలా కాలం గడుపుతున్నారు.

Leave a Reply