నాటి బడుగుజీవి.. నేటి బాహుబలి
కూలీ కుటుంబం నుంచి అతిపెద్ద వ్యాపారవేత్తగా
క్రమశిక్షణకు ప్రతిరూపం.. మానవీతకు నిలువెత్తు నిదర్శనం
వినయం, విధేయతలకూ నిజరూపం వెంకయ్య
విజయవాడలో మేటి వాణిజ్యవేత్తగా రాణింపు
సామాజిక సేవా తత్పరతకు చిరునామా
95 ఏండ్ల వయస్సులోనూ కుర్రాడిలా పనులు
అన్ని పార్టీల లీడర్లతోనూ సన్నిహత సంబంధాలు
డౌన్ టు ఎర్త్.. ఐలాపురం వెంకయ్య జీవన చిత్రం
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ:
అది పల్నాడు గడ్డ.. మండే ఎండలకు నెలవుగా ఉండే రెంటచింతల ఇలాఖా. అందులో తుమృకోట అతిచిన్న పల్లె నాపరాళ్ల తోట. ఆ పక్కనే కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తుంటే.. ఈ ఊరిలో తాగునీరే దొరకదు. సేధ్యానికి ఆకాశమే దిక్కు. వానపడితే జొన్న చేలు పండేవి. ఈ మెట్ట భూముల్లో కూలీనాలీ పనులు కూడా అంతంతం మాత్రమే. కానీ, ఈ తుమృకోట చారిత్రాత్మకం. ఔరంగజేబు పాలన రుచిచూసిన నేల. ఆయన ఇక్కడ పెద్ద మసీదు కట్టించారు. అగ్రకుల పెత్తందారీ తనం రెక్కలు విచ్చుకున్న కాలం అది.. పెళ్లిళ్లు పండుగలకు వెళ్లాలంటే దారితెన్నూ లేదు. 10 కిలోమీటర్ల దూరంలోని మాచర్ల సంతకు వెళ్లి సరుకులు తెచ్చుకునే స్థితి. సరిగ్గా 1930లో ఐలాపురం రామయ్య, కోటమ్మ దంపతులకు వెంకయ్య జన్మించారు. ఆయనకు సైదమ్మ, వీరాస్వామి తోబుట్టువులు. ఈ కుటుంబం కులవృత్తితో.. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తోంది. నిజానికి వీరికి 2.40 ఎకరాల భూమి ఉన్నా.. సాగు చేయలేని స్థితి. 1946లో కరువు పరిస్థితులను తట్టుకోలేక రామయ్య తన కుటుంబంతో విజయవాడకు బయలుదేరారు. ముగ్గురు బిడ్డలు, భార్యతో దాదాపు 185 కిలోమీటర్లు కాలినడకన బెజవాడకు చేరుకున్నారు. కూలీనాలీ జీవనం ప్రారంభించారు. చిన్న చిన్న పనులు, రోజువారీ కూలీతో జీవనం ప్రారంభించారు. సహజ సిద్ధంగా శ్రమించటంలో వెనుతిరగని ఈ కుటుంబం బెజవాడలో క్రమేపీ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. భార్య ఇందిరాదేవితో వెంకయ్యకు వివాహం జరిగింది. ఎనిమిది మంది సంతానంతో వెంకయ్య బతుకు బండిలో మార్పు వచ్చింది. ఇదే ఆయన జీవితంలో పెనుమార్పు తీసుకువచ్చింది.
సున్నపు బట్టీలో శ్రామికుడే..
ప్రకాశం బ్యారేజీ.. నాగార్జున సాగర్ కలయికతో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారింది. ఇక బ్లేజ్ వాడ .. బెజవాడ వాణిజ్య కేంద్రంగా అవతరించింది. భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. శ్రమజీవుల ఆకలి దప్పులు తీరుతున్న తరుణంలో సున్నపు బట్టీలో శ్రామికుడు ఐలాపురం వెంకయ్య జీవన స్థితి గతి మారింది, సున్నం సరఫరా చేసే ఓ చిరువ్యాపారిగా మారారు. క్రమేపీ ఆయన అడుగులు వ్యాపార పథంలో ముందుకు నడిపాయి. రైల్వేస్టేషన్‌కు సమీపంలో మరో చిరువ్యాపారం ప్రారంభించారు. రోజు రోజుకూ పొదుపు, మదుపు బంగారు బాట వేసింది. ఎప్పటికైనా గాంధీనగర్‌లోని కాలువ గట్టు సమీపంలో పెద్ద భవనం కట్టాలని ఐలాపురం వెంకయ్య ఓ నిర్ణయానికి వచ్చారు.
ఆ రెండు అతి పెద్ద హోటళ్ల నడుమ…
నిజానికి విజయవాడలో పెట్టుబడి పెట్టాలన్నా.. వ్యాపారం చేయాలన్నా.. ఓ బడుగు జీవికి అసాధ్యం. కానీ ఐలాపురం వెంకయ్య తన శ్రమైక శక్తితో బాహుబలిగా మారిపోయారు. విజయవాడలో 1980 రోజుల్లో బందరు రోడ్డులో రెండు పెద్ద హోటల్స్ ఉండేవి. అవే మమత.. మనోరమ. ఈ రెండు హోటళ్లల్లో సంపన్నులకే ఆతిథ్యం లభించేది. ఇలాంటి స్థితిలో అటు స్వర్ణాప్యాలెస్.. ఇటు ఐలాపురం హోటళ్ల నిర్మాణం తెరమీదకు వచ్చింది. 1989లో ఐలాపురం హోటల్ నిర్మాణానికి పునాది పడింది. 1991లో హోటల్ వ్యాపారం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ హోటల్ అంటే.. సంపన్నులే కాదు.. మధ్యతరగతి వర్గాలకు ఆతిథ్యం లభించింది. ఈ హోటల్ నిర్వహణలో ఇప్పటి వరకూ ఏ వివాదమూ నమోదు కాలేదు. అంటే, ఎంత నిక్కచ్చిగా.. నిజాయితీగా ఈ హోటల్ నిర్వహణ సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
నాటి బడుగు జీవే.. నేటి బాహుబలి
జాతీయోధ్యమ స్ఫూర్తితో ఐలాపురం వెంకయ్య రాజకీయ చైతన్యం పెరిగింది. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా కొనసాగారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో మితిమీరిన ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. ప్రతి నేత తానే సర్వస్వం అనుకోవటం సర్వసాధారణం. కానీ, వెంకయ్యలో ఏనాడు బేషజం కనిపించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీలోని విభిన్న వర్గాలు వేర్వేరు భావాలను వ్యక్తం చేసినా.. ఐలాపురం వెంకయ్య విషయంలో అందరూ ఏక నినాదమే వినిపించేవారు. వెంకయ్య మంచోడు. మృదుస్వభావి. అని కాంగ్రెస్ నాయకులు భావించారు. అందుకే పార్టీ అగ్రనేతలు మారినా.. వెంకయ్య విన్రమతకు అందరూ ఫిదా అయ్యారు.
ముఖ్యమంత్రులందరికీ ముఖ్యమైన వ్యక్తిగా..
1994లో రాజకీయంగా అడుగులు వేశారు. ముఖ్యమంత్రులు విజయభాస్కరరెడ్డి, జనార్థనరెడ్డి, అంజయ్య, రాజశేఖరరెడ్డి, రోశయ్యతో తత్సంబంధాలు ఉన్నాయి. పర్వతనేని ఉపేంద్ర ఎంపీగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి కోట శ్రీనివాసరావుపై 3 వేల ఓట్లతో ఓడిపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారిగా ఐలాపురం వెంకయ్యకు మ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీగా పోటీ లేకుండా గెలుపొందారు. 2012లో రెండోసారి మళ్లీ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా వైఎస్సార్ చాన్స్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుత్తా శివరామకృష్ణపై 181 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీని వీడలేదు. పదవుల కోసం ఏ పార్టీలోనూ చేరలేదు. అందుకే టీడీపీ, జనసేన పార్టీలే కాదు.. వామపక్ష పార్టీలు సైతం ఇప్పటికీ ఐలాపురం వెంకయ్యను గౌరవించటం విశేషం. రాజకీయాలకు తావు లేకుండా సామాజిక సేవలో నిత్యం మమేకమయ్యే వెంకయ్యకు అందరి నుంచి గౌరవం దక్కుతోంది.
చదువంటే అమిత ఇష్టం
ఐలాపురం వెంకయ్యకు చదువంటే ఎనలేని ప్రేమ. చదివినోడే మారాజు అనే సంకల్పం ఆయనది. ఎందుకంటే.. తుమృకోట బోర్డు స్కూలులో ఆయన ఫోర్త్ ఫారం వరకూ చదివారు. అంటే తొమ్మిదో తరగతి. సెకండ్ ఫారం సమయంలో ఆయన తరగతిలోనే ఫస్ట్ వచ్చారు. అలా ప్రతి తరగతిలోనూ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత మెట్రిక్ చదివే అవకాశం ఉంది. మెట్రిక్ పూర్తి చేస్తే చాలు.. సర్కారీ ఉద్యోగం వచ్చేది. కానీ, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తుమృకోటను వీడక తప్పలేదు. ఇలా ఆయన చదువుకు పుల్‌స్టాప్ పడింది. తన పరిస్థితులు, ఆ జ్ఞాపకాల గమనంలో చదుకునే విద్యార్థులంటే ఎనలేని మమకారం చూపించారు. కడకు తన బిడ్డలనూ బాగా చదవండి, ఎంత చదివితే అంత చదివిస్తా.. చదువులో వెనుకపడవద్దని చైతన్య పర్చారు. చదువుపై ఆసక్తి కలిగిన విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, దుస్తులు, ఫీజులు, ఇతోదికంగా సాయం చేశారు. ఆయన సాయంతో చాలామంది ప్రయోజకులయ్యారు. ఆయన సాయం పొందిన వారు బెంగళూరు, ఒడిశా, ఢిల్లీ , హైదరాబాద్ వంటి మహా నగరాల్లో కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి ఇతర దేశాల్లోనే ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు.
ఆధ్యాత్మిక సేవలోనూ..
ఆధ్యాత్మికంగా ఎంతో భక్తి కలిగిన ఐలాపురం వెంకయ్య ఏలూరు రోడ్డులో రామమందిరం నిర్మించారు. ఈ రామమందిరానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. గవర్నర్ బంగ్లా వద్ద నాగేంద్రస్వామి దేవాలయం, హనుమాన్‌పేటలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి, శ్రీశైలంలోని శాలివాహన సత్రం, తిరుపతిలో కాటేజీలు, షిర్డీలో కాటేజీలు, కాశీలో కాటేజీలను నిర్మించారు. ఆలయాల అభివృద్ధికి విరివిగా గుప్త దానాలు చేశారు. కుమ్మరి జన సంక్షేమం కోసం.. ఆయన అవిరళ కృషి వర్ణనాతీతం. ఉమ్మడి ఆంధ్రరప్రదేశ్లో కుమ్మరి శాలివాహన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పటి సీఎం వైఎస్సార్‌తో మాట్లాడి కుమ్మరి శాలివాహన సొసైటీ ఏర్పాటు చేసి వృత్తిదారులకు రుణ సదుపాయం కల్పించి అభివృద్ధికి కృషి చేశారు. ఎమ్మెల్సీగా తన నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.
నిత్యకృషీవలుడు.. స్ఫూర్తిదాత..
ప్రస్తుతం ఐలాపురం వెంకయ్య వయస్సు 95ఏళ్లు నిండాయి. మరో ఐదేళ్లల్లో సెంచరీ పూర్తి చేస్తారు. ఇందులో డౌట్ ఆనుమానం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇప్పటికీ ఆయన ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. శ్రమిస్తూ.. తన విధులను నిక్కచ్చిగా చేస్తున్నారు కాబట్టి, ఎలాంటి అనారోగ్యం లేదు కాబట్టి ఈ విషయం స్పష్టంగా చెప్పాల్సి వస్తోంది. ఇప్పటికీ రోజూ ఐలాపురం హోటల్‌కు ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. అకౌంట్స్ విభాగం ఉద్యోగులతో మీటింగ్‌పెట్టి దిశానిర్దేశం చేస్తారు. ఇప్పటికీ అకౌంట్స్ చెక్కులను పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలోని ప్రముఖ పార్టీలో నాయకులంతా తరచుగా ఆయన్ను కలుస్తుంటారు. ఆయన దగ్గర క్రమశిక్షణ ఎంతో నేర్చుకోవచ్చు. ఏనాడూ ఎవ్వరినీ కించపరిచే రీతిలో వ్యవహరించింది లేదు. ఆయన కుమారు రాజా కూడా ‘‘నేను సైతం నాన్న బాటలో’’ అనే రీతిలో నడుస్తున్నారు. వివాదరహితుడిగా, నిజాయతీ, నిక్కచ్చికి, క్రమశిక్షణకు ప్రతిబింబంగా రాజా ఐలాపురం ఖ్యాతిని పెంచుతున్నారు. ఇక ఐలాపురం వెంకయ్య జీవన విధానం నేటి యువతరానికి ఓ దిక్చూచిగా.. స్పూర్తిగా నిలుస్తందంటే అతిశయోక్తి కాదు.