ఈరోజు అవతారం రాజరాజేశ్వరీ దేవి

అంబా రౌద్రిని భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా
చాముండా శ్రితరక్షపోష జననీ దాక్షాయణీ ప్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ !!

దుర్గానవరాత్రులో ఆఖరి రోజైన దశమి నాటి అవతారము శ్రీరాజరాజేశ్వరి. పరమేశ్వరుని అంకముపై ప్రకాశముతో వెలుగొందుతూ, భక్తులకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఙ్ఞానశక్తిని ప్రసాదించే అవతారము శ్రీరాజరాజేశ్వరి. ఏ దేవి రూపమైన, ఏ శక్తి రూపమైన అన్నిటికి మూలమైన శక్తి పరమేశ్వరి. ఈరోజు ఈ తల్లిని లలితా సహస్రనామ పారాయణ చేసి ఆరాధించాలి. చేమంతులతో పూజ చేయాలి. భక్ష్య, భోజ్యములతో మహానివేదన చేయాలి. బంగారు కవచధారణ చేస్తారు లేదా బంగారు వర్ణముగ వస్త్రముతో అలంకరిస్తారు.

ఈ రోజున విజయదశమిగా పూజిస్తాము. ఈ రోజు అశ్వపూజ, ఆయుధపూజ, ఉఛ్చైశ్రవ పూజ, వాహన పూజ నిర్వహిస్తారు. శ్రీరాముడు విజయదశమి రోజున ‘అపరాజితాదేవిని’ పూజించి రావణుని సంహరించి విజయం పొందాడు. నవరాత్రుల అనంతరము దశమి రోజు సాయంత్రము నక్షత్ర దర్శన సమయంలో శమీవృక్షము వద్ద అపరాజితాదేవిని స్మరిస్తారు.

‘‘శమీ శమయతే పాపం, శమీ శతృవినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శినీ’’

ఈ మంత్రముతో తమ తమ గోత్రనామాలు చెప్పుకుని జమ్మి వృక్షాన్ని పూజ చేసి మూడు ప్రదక్షిణలు చేస్తారు. శ్రీరాముడు దశకంఠుని సంహరించిన రోజు గనుక ‘‘దశహర’’ అని కూడా పిలువబడుతోంది. దేవదానవులు పాల సముద్రము మథనం చేసి అమృతం సంపాదించినది కూడా దశమి రోజునే. తిథి, వార, నక్షత్ర గణన లేకుండా విజయదశమి రోజున చేపట్టిన సకల కార్యాలు విజయం పొందుతాయని నమ్మిక. ఇదే విషయము ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రందములో విపులంగా వివరించటం జరిగింది.

దేవీ ఉపాసకులు అంతవరకు తాము చేసిన జప సంఖ్య ననుసరించి తగువిదముగా హోమాలు చేస్తారు. నవరాత్రి వ్రత సమాప్తి గావించిన వారికి సర్వ సిద్ధులు, సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది.

ఈ రోజు శ్రీశైలంలో అమ్మవారు నందివాహనంపై బ్రమరాంబికగా దర్శనమిస్తారు.

శుభం భూయాత్‌!!

డా. దేవులపల్లి పద్మజ
విశాఖపట్టణము

Leave a Reply