తిర్యాణి (ఆంధ్రప్రభ): కొద్దిసేపటి క్రితం తిర్యాణి మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో మీసేవ కార్యాలయం ముందున్న ప్రధాన రహదారిపై నీరునిలిచిపోయి.. అది జలాశయాన్ని తలపిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ప్రజలు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
గత కొంతకాలంగా పరిష్కారం కాని సమస్యగా.. రహదారిపై నీరు నిల్వ ఉండిపోతూనే ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలను సమన్వయం చేసి కాల్వల పూడికలను తీయాల్సిన గ్రామపంచాయతీ అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోవడంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలో నీరు నిల్వ ఉండి జలాశయంలా మారిపోయినా, అధికారులు–ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ప్రధాన రహదారిపై నిల్వ ఉన్న నీటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

