తిరుమల – ఈ ఏడాది జులై నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలకు సంబంధించిన కోటా టికెట్ల విడుదల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 19వ తేదీన ఉదయం 10 నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. రెండు రోజుల పాటు అంటే 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవి తెరిచి ఉంటాయి. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.
ఆర్జిత సేవలు
శ్రీవారి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి సేవలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటా బుకింగ్ ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి. అలాగే- వర్చువల్ విధానంలో శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణలో పాల్గొనదలిచిన వారి కోసం 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్ అందుబాటులో ఉంటుంది.
అంగప్రదక్షిణం..
తిరుమలలో అంగప్రదక్షిణం చేయదలిచిన భక్తులకు ఉద్దేశించిన ఆన్‌లైన్ టోకెన్లు 23వ తేదీన ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. శ్రీవాణి టికెట్ల కోటా కూడా అదే రోజున ఉదయం 11 గంటలకు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.
300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం
జులైలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేస్తారు టీటీడీ అధికారులు. తిరుమల, తిరుపతిల్లో వసతి గదులను బుక్ చేసుకోవదలిచిన వారు అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
వసతి గదులు..
తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను బుక్ చేసుకోవచ్చు. తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.