వైకుంట ఏకాదశికి పటిష్ట బందోబస్తు..

  • టికెట్లు కేటాయించిన సమయానికే దర్శనం
  • తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.. ఎస్.పి సుబ్బారాయుడు

ఆంధ్రప్రభ, తిరుపతి : వైకుంట ఏకాదశి దర్శనం కల్పించడంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుదువారం వైకుంట ఏకాదశి లో భాగంగా తీసుకున్న భద్రతా ఏర్పాట్ల పై జిల్లా ఎస్.పితో కలిసి మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం సక్రమంగా కల్పించేందుకు టీటీడీతో పాటు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని చెప్పారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై రెండు రోజుల క్రితమే జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి కలిసి తిరుపతిలో టీటీడీ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారని తెలిపారు.

అంతకుముందే టీటీడీ, జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు సమీక్షలు నిర్వహించాయని పేర్కొన్నారు.

పది రోజుల పాటు జరగనున్న వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాల్లో భాగంగా మొదటి మూడు రోజులు ద్వాదశి, ఏకాదశి, త్రయోదశి రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. టీటీడీ ప్రవేశపెట్టిన ఈ లింక్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది భక్తులు దర్శన టికెట్లు పొందినట్లు చెప్పారు.

దేవాదాయ శాఖ మంత్రి పది రోజుల దర్శనాల్లో సుమారు 90 శాతం సామాన్య భక్తులకు అవకాశం కల్పించామని, వీఐపీ వీవీఐపీ దర్శనాలకు 10 శాతం కన్నా తక్కువగా మాత్రమే అవకాశం ఇచ్చామని వెల్లడించారు.

టీటీడీ సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇస్తూ దర్శన సమయాన్ని ఎక్కువగా కేటాయించిందన్నారు. స్థానిక భక్తులకు కూడా దర్శన సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుపతి పట్టణంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, శానిటేషన్ ఏర్పాట్లు కూడా పటిష్టంగా చేపట్టామని చెప్పారు. టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కలిగిన భక్తులు సులభంగా తిరుమల చేరుకునేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా పది రోజుల పాటు సుమారు 3,000 మంది పోలీసు సిబ్బందిని నియమించామని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు జరగనున్న వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన ఏర్పాట్లలో భాగంగా తిరుమల-తిరుపతి ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు మరియు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. టీటీడీ ప్రవేశపెట్టిన ఈ లింక్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు రోజుకు 60,000 మందిని దర్శనానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. టికెట్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీ సమయంలోనే దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టామని తెలిపారు. టీటీడీ బోర్డు మరియు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సవివరంగా చర్చించారని అన్నారు. తిరుపతిలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరి, శ్రీవారి మెట్లు, స్థానిక దేవాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా డ్రోన్లు, సీసీ కెమెరాల సహాయంతో నిరంతర నిఘా కొనసాగుతుందని చెప్పారు.

టీటీడీ లింక్ ద్వారా దేశవ్యాప్తంగా టికెట్లు పొందిన భక్తులకు అవగాహన కల్పించడంలో మీడియా మిత్రులు సహకరించాలని కోరారు. భక్తులు తమకు కేటాయించిన సమయానికే రావాలని, అలా చేస్తే రద్దీ తగ్గి ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. రద్దీ దృష్ట్యా పార్కింగ్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న భక్తులు స్థానిక తిరుపతి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

వైకుంఠ ద్వార దర్శనం పేరిట కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారని, టోకెన్లను ఇతరులకు ఇచ్చే ప్రయత్నాలు చేయరాదని హెచ్చరించారు. టోకెన్ స్లాట్ అలాట్ అయిన భక్తులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు లేదా గుర్తింపు పత్రాలు వెంట తీసుకురావాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా, అధికారిక మీడియా మరియు వెబ్‌సైట్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply