
Cold wave | మరో మూడు రోజులు చలిగుప్పిట్లోనే..
Cold wave | మరో మూడు రోజులు చలిగుప్పిట్లోనే..
ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు చలి పంజా విసరనుంది. ఈ మూడురోజుల్లో రాష్ట్రావ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రధానంగా తూర్పు, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని, దీనివల్ల సోమవారం వరకు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీలో అత్యల్పంగా 6.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.4 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఈ నేపథ్యంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. మిగిలిన 23 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 నుండి 12.8 డిగ్రీల మధ్య ఉండటంతో ఆయా ప్రాంతాలకు ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు.
రాజధాని హైదరాబాద్‌లో కూడా చలి తీవ్రత అధికంగా ఉండబోతోంది. నగరంతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నాయి. తెల్లవారుజామున పొగమంచు కురిసే అవకాశం ఉండటంతో వాహనదారులు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
