Threatening Mail | నిన్ను , నీ కుటుంబాన్ని లేపేస్తాం – గంబీర్ కు ఐసిస్ వార్నింగ్

న్యూ ఢిల్లీ – భార‌త క్రికెట్ జ‌ట్టు ప్రధాన కోచ్‌, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌కు హ‌త్య‌ బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ ‘ఐసిస్‌ కశ్మీర్‌’ నుంచి రెండు మెయిల్స్‌ వచ్చాయని ఢిల్లీ పోలీసులకు ఆయ‌న‌ ఫిర్యాదు చేశాడు. తనతో పాటు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరాడు. గంభీర్ తక్షణ చర్య కోరుతూ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారని మాజీ ఎంపీ కార్యాలయాన్ని ఉటంకిస్తూ ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ నివేదించింది. ఈ నెల 22న గౌతీకు రెండు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. ఒకటి మంగళవారం మధ్యాహ్నం రాగా, మరొకటి అదేరోజు సాయంత్రం వచ్చింది. రెండిటిలోనూ ‘ఐ కిల్‌ యూ’ (IKillU) అనే సందేశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయ‌న రాజిందర్ నగర్ పోలీస్ స్టేషన్‌తో పాటు సెంట్రల్ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన ఢిల్లీలోని రాజిందర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గంభీర్‌కు ఇలాంటి బెదింపులు రావడం ఇది మొదటిసారి కాదు. నవంబర్ 2021లో ఆయన ఎంపీగా ఉన్న సమాయంలో కూడా ఇలాంటి ఈ-మెయిల్‌ వచ్చింది. కాగా, మంగళవారం పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిని గంభీర్‌ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదికగా తీవ్రంగా ఖండించిన విష‌యం తెలిసిందే. “మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు త‌ప్ప‌కుండా మూల్యం చెల్లించుకుంటారు. భార‌త్ ప్ర‌తీకార‌ దాడి చేస్తుంది” అని గంభీర్ ఎక్స్‌ లో పోస్ట్ చేశారు.

గంబీర్ ఫిర్యాదు నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, విచారణ ప్రారంభించారు. అలాగే గంభీర్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయన కుటుంబానికి కూడా అదనపు రక్షణ కల్పించారు. సైబర్ క్రైమ్ విభాగం ఈ ఇమెయిల్‌ల మూలాన్ని గుర్తించేందుకు ట్రాకింగ్ పనులు చేపట్టింది. ప్రాథమిక దర్యాప్తులో ఈ ఇమెయిల్‌లు విదేశాల నుంచి, ముఖ్యంగా పాకిస్థాన్ లేదా ఇతర దేశాల నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *