న్యూఢిల్లీ : అమెరికా కొత్త సుంకాల నిబంధనలు తెచ్చిన నేపథ్యంలో భారత్ కౌంటర్ ఇచ్చింది. భారత్‌పై అమెరికా కొత్త సుంకాల నిబంధనలు తీసుకురావడంతో, ప్రతిస్పందనగా అమెరికాకు వెళ్లే పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఆగస్టు 25, 2025 నుండి అమల్లోకి రానుంది.
ఎందుకు నిలిపివేశారు?
జూలై 30న అమెరికా ప్రభుత్వం ఒక కొత్త ఉత్తర్వులు (Executive Order 14324) జారీ చేసింది. ఇప్పటివరకు అమెరికాకు $800 వరకు విలువ ఉన్న వస్తువులు డ్యూటీ-ఫ్రీగా (పన్ను లేకుండా) పంపించుకోవచ్చు. కానీ ఆగస్టు 29 నుంచి ఈ మినహాయింపు రద్దవుతుంది. దీంతో $800 వరకు ఉన్న వస్తువులకు పన్ను మినహాయింపు రద్దవుతుంది. అంటే ఇకపై చిన్నవైనా, పెద్దవైనా అన్ని వస్తువులపై పన్ను పడుతుంది.
ఇక పన్నులు ఎలా వసూలు చేస్తారు.. ఎప్పుడు జమ చేస్తారు అనే దానిపై US కస్టమ్స్ ఇంకా అస్పష్టంగా ఉన్నందున, కార్గో ఎయిర్‌లైన్స్ కూడా ఆగస్టు 25 తర్వాత అమెరికాకు పోస్టల్ పార్సిళ్లు తీసుకెళ్లలేమని చేతులెత్తేశాయి. దీంతో, ఇప్పటికే అమెరికాకు బుక్ చేసిన పార్సిల్‌లు డెలివరీ కాలేకపోతే, కస్టమర్లు రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది. పరిస్థితి కాస్తంత స్పష్టంగా మారిన వెంటనే పోస్టల్ సేవలు తిరిగి ప్రారంభమవుతాయని పోస్టల్ శాఖ తెలిపింది.