బన్నీ సంప్రదాయ ఉత్సవం

  • ప్రశాంతంగా జరుపుదాం
  • కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్


(కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో) : అక్టోబర్ 2న జరగనున్న దేవరగట్టు (Devaragattu) శ్రీ మాల మల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా, సంక్షోభం లేకుండా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ (Vikrant Patil) అన్నారు. దసరా పండుగ సందర్భంగా జరిగే ఈ ఉత్సవం సందర్భంగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశమున్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.

ఉత్సవం సందర్భంగా 800 మంది పోలీసుల (800 police officers) తో బందోబస్తు నిర్వహించనున్నారు .ఇందులో ఏడుగురు డీఎస్పీలు, 50 మంది సీఐలు, ఆర్ఐలు, 59 మంది ఎస్సైలు, 95 మంది ఎఎస్సైలు , హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది సివిల్, ఎఆర్ కానిస్టేబుళ్లు, 18 మంది స్పెషల్ పార్టీ సభ్యులు, 90 మంది హోంగార్డులు విధుల్లో పాల్గొంటారు. వీటితో పాటు దేవరగట్టు పరిసర గ్రామాల్లో 5 చెక్‌పోస్టులు, 10 పికెట్లు ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు చేపడుతున్నారు. 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 700 ఎల్ఈడి లైట్లు, 10 డ్రోన్ కెమెరాలు, వీడియో రికార్డింగ్ వ్యవస్థలు కంట్రోల్ రూమ్ నుంచి కఠిన నిఘా కొనసాగుతోంది.

అక్రమ మద్యం తయారీ (Illegal manufacture of liquor), రవాణా, నాటుసారా నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకున్నామని, 198 మందిని బైండోవర్ చేసి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ల ద్వారా గతంలో ఘర్షణలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

బన్ని ఉత్సవం సంప్రదాయానికి ప్రతీకగా జరగాల్సింది కానీ, “కర్రల సమరం” (Stick fight) అనే పదానికి తావు లేదని, అది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. కర్రలు దేవుని ఊరేగింపులో భాగంగా చేత పట్టుకునే ఒక సంప్రదాయ రూపం తప్ప, అల్లర్లు, దాడులకు అవి వేదిక కావద్దన్నారు. కర్రల సమరం వంటి పదాలను వాడకూడదని, ఇది ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా మారదని సూచించారు.

నెరణికి, కొత్తపేట, అరికెర, ఎల్లార్తి గ్రామాల్లో మద్యం మత్తులో కర్రలతో దాడులు, గాయాలు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అండ్ రెవిన్యూ శాఖల (Police and Revenue Departments) సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఉత్సవ సమయంలో ఫైర్ సిబ్బంది, వైద్య బృందాలు, అంబులెన్స్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

ఉత్సవానికి హాజరయ్యే చిన్నపిల్లలపై తల్లిదండ్రులు (parents) ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఉత్సవం సమయంలో బహిరంగ మద్యం సేవించడం, నిబంధనలు ఉల్లంఘించడం, అల్లర్లకు పాల్పడడం లాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని, భక్తుల్లో మార్పు రావాలని, సంప్రదాయాన్ని కాపాడే దిశగా ప్రయాణించాలన్నది పోలీసు యంత్రాంగం ఆకాంక్ష అన్నారు.

Leave a Reply