ప్రేమలేఖలతో అల్లరి
- హెచ్ ఎం మందలింపు
- స్కూలులో కిష్కింద కాండ
శ్రీ సత్య సాయి బ్యూరో, అక్టోబర్ 13( ఆంధ్రప్రభ ): ఇరువురు విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దండించినందుకు ప్రధానోపాధ్యాయునిపై పగ పెంచుకున్న ఆ విద్యార్థులు పాఠశాలలోకి వెళ్లి వీరంగం సృష్టించారు. శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) పుట్టపర్తి రూరల్ పరిధిలోని కంబాలపర్తి గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, విద్యార్థులకు పవిత్ర ఆలయంగా భావించే పాఠశాలలో ఇరువురు విద్యార్థులు (ఇద్దరు కూడా ఇతర పాఠశాలకు చెందినవారే). తప్పుడు రాతలు రాశారు. ఫలానా అమ్మాయి వాడికి లవర్ అని, వీడికి మరో అమ్మాయి లవర్ అంటూ ఇలా ఏవో పిచ్చి పిచ్చి రాతలు రాశారు. విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయులు రామాంజనేయులు వారిని పిలిపించి, ఇది మంచి పద్ధతి కాదని, దండించి మరోసారి ఇలాంటి రాతలు రాయకండి అంటూ పంపించారు. దీంతో అవమానంగా భావించిన ఆ ఇద్దరు విద్యార్థులు ప్రధానోపాధ్యాయులపై పగ పెంచుకున్నారు.

ఏదో విధంగా ఆయనకు దెబ్బతీయాలని నిర్ణయించుకున్నారు. అంతే ఇరువురు విద్యార్థులు (students) సదరు ప్రధాన ఉపాధ్యాయులు పనిచేసే పాఠశాలకు వెళ్లి, తాళాలు పగలగొట్టారు. పాఠశాల లోపలికి ప్రవేశించి, పాఠశాలలోని పలు వస్తువులను ముఖ్యంగా ఆహార వస్తువులను చిందర బంధరగా చేసి, వీరంగం సృష్టించారు. ముఖ్యంగా కోడిగుడ్లను పాఠశాలలోని బ్లాక్ బోర్డులకు, గోడలకు వేసి కొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకా పాఠశాలలోని చిక్కీలను పాఠశాల టాయిలెట్లో వేశారు. ఆయిల్ ప్యాకెట్లు, చింపేసి ఎక్కడబడితే అక్కడ పారబోశారు. స్కూల్లో విద్యార్థులు చేసిన కిష్కిందకాండ కారణంగా పెద్దగా శబ్దాలు వచ్చాయి.
దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. గ్రామస్తులను చూసి సదరు విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు. రెండవ శనివారం, ఆదివారం తో కలిపి పాఠశాలకు రెండు రోజులు సెలవు వచ్చింది. ఈ ఆకతాయిలకు అనుకూలంగా మారింది. విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయులు (Principal) రామాంజనేయులు ఆదివారం పాఠశాలకు చేరుకొని జరిగిన విషయాన్ని పుట్టపర్తి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ లింగన్న సదరు విద్యార్థులను తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. అంతేకాకుండా జరిగిన నష్టపరిహారాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల భరించే విధంగా నిర్ణయించి పంపించారు.
సోమవారం పరిస్థితి….
పాఠశాలలో జరిగిన కిష్కింద కాండ (Kishkinda Kanda) కారణంగా పాఠశాల అస్తవ్యస్తంగా మారింది. దీంతో ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థులతో శుభ్రం చేయించడం మొదలెట్టాడు. విషయం తెలుసుకున్న విలేకరులు వెళ్ళగానే విద్యార్థులను పక్కకు పంపించి పాఠశాలను శుభ్రం చేసేందుకు ఎవరినైనా పని మనుషులను పిలిపించాలని ఆలోచిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు సృష్టించిన వీరంగం పట్ల అటు పోలీసులు ఇటు గ్రామస్తులు తీవ్రంగా పరిగణించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా ఒకసారి ఇదే విద్యార్థులు గందరగోళం చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కేవలం ఐదు, ఆరు తరగతులు చదువుకొని విద్యార్థులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే దీన్ని తీవ్రంగా పరిగణించి విద్యార్థుల్లో ఉన్న పగ, చెడు ఆలోచనలను ఆదిలోనే తుంచి వేసే విధంగా అటు తల్లిదండ్రులు ఇటు పోలీసులు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమేరకు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. మరోసారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా చూడాల్సిన అవసరం ఉంది.
