ఏటీఎం మిషన్లే వీరి టార్గెట్…

  • ఓరుగల్లులో 7 సెంటర్స్ లో చోరీ
  • ఏటీఎం చోరీ గ్యాంగ్ అరెస్ట్

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా ఏటీఎంలే లక్ష్యంగా సరికొత్త తరహా చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన ఏడుగురు సభ్యుల అంతర్ రాష్ట్ర ముఠాను వరంగల్‌లో సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు. అల్వార్ జిల్లా మాల్కిడాకు చెందిన ఆరిఫ్ ఖాన్, సర్ఫరాజ్, అష్ మహ్మద్, షాపుస్ ఖాన్, షారూఖాన్, అస్లాం ఖాన్, షారుఖాస్ అనే ఏడుగురు నిందితులు వరంగల్‌కు రెండు కార్లలో వచ్చి, నగరంలోని ఏడు సెంటర్లలోని ఏటీఎం మిషన్లను టార్గెట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేటుగాళ్లు ఏటీఎం మిషన్ నుండి డబ్బులు వచ్చే స్టీల్ ప్లేట్ వద్ద టేప్ అంటించిన ఇనుప రేకును అడ్డుపెట్టి చోరీలకు పాల్పడేవారు. కస్టమర్లు నగదు విత్‌డ్రా చేసినప్పుడు మెసేజ్ వస్తుంది కానీ, నిందితులు పెట్టిన అడ్డంకి వల్ల డబ్బులు బయటకు రావు.

టెక్నికల్ సమస్య అని భావించి వినియోగదారులు వెళ్లిపోగానే, దొంగలు ఆ ఇనుప రేకును తొలగించి లోపల చిక్కుకున్న నగదును దోచుకునేవారు. ఈ దొంగతనాల వల్ల బ్యాంకులు లేదా కస్టమర్లకు నేరుగా నష్టం జరగకుండా, థర్డ్ పార్టీ మెయింటెనెన్స్ ఏజెన్సీలు నష్టపోతుండటంతో ఈ క్రైమ్ ఇన్నాళ్లు వెలుగులోకి రాలేదు.

శనివారం ఉదయం మరోసారి చోరీలకు సిద్ధమైన ఈ గ్యాంగ్‌ను సిసిఎస్, కాజీపేట పోలీసులు పక్కా సమాచారంతో, అదునాతన సాంకేతికతను ఉపయోగించి వెంటాడి పట్టుకున్నారు. ఈ క్ర‌మంలో వీరి వద్ద నుండి రూ.5.10 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, డూప్లికేట్ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ, దేశంలోనే ఈ తరహా ఏటీఎం ముఠాను పట్టుకోవడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ముఖ్యంగా బ్యాంకులు బంద్ ఉండే పండుగలు, వారాంతాల్లోనే వీరు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పాత ఏటీఎం మిషన్ల వద్ద సెక్యూరిటీ పెంచాలని, వినియోగదారులు డబ్బులు రానప్పుడు వెంటనే అప్రమత్తమై ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. ప్రాణాలకు తెగించి సినీ ఫక్కీలో ఈ ముఠాను పట్టుకున్న పోలీసు బృందాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply