సృజన లోకం నిలవాల్సింది బడుగుల పక్షమే…

బలవంతుల దౌర్జన్యాలను నిరసిస్తూ బలహీనుల పక్షాన నిలిచే కవులు, రచయితలు కళాకారులు, సృజనకారులు ఇప్పుడు బడుగుల పక్షాన నిలవాలని, బడుగులకు దక్కాల్సిన ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాలు వారికి దక్కేవరకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు.

తెలంగాణ అస్తిత్వ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో కవులారా మీరేటువైపు అని ప్రశ్నిస్తే సృజన లోకం జైకొట్టిందన్నారు. బీసీలు తమ అస్తిత్వం కోసం పెనుగులాడుతున్న ఈ సందర్భంలో తిరిగి సాహితీ సృజనలోకం బడుగుల పక్షం నిలవాల్సిన చారిత్రక అవసరం ముందుకొచ్చిందని పేర్కొన్నారు.

“సేవ” తెలుగు భాషా సాహితీ సంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులో జరుగుతున్న గిడుగు రాంమూర్తి పంతులు జయంతి సందర్భంగా జరుగుతున్న తెలుగు భాషా ఉత్సవాలు “రెండవ రోజున” అస్తిత్వవాద సాహిత్యం సదస్సులో జూలూరు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యవహారిక భాషా ఉద్యమాన్ని చేసిన గిడుగును తలుచుకుంటూ వందేళ్ల తర్వాత జరిగే ఈ సదస్సు తరతరాలుగా సామాజిక న్యాయానికి దూరంగా ఉన్న బీసీల హక్కుల సాధనలో వారికి అండగా నిలవడమే సాహిత్య లోకం కర్తవ్యం అన్నారు.

అన్ని రకాల ఆధిపత్యాలను ధిక్కరిస్తూ బాధిత ఆస్తిత్వాల పక్కన నిలిచి పోరు జెండాలు ఎగురవేయవలసిన బాధ్యత సాహిత్య లోకం పై ఉందన్నారు. ఇప్పుడు సగం జనాభాకు చెందాల్సిన న్యాయబద్ధమైన హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి అండగా నిలిచి సాహిత్య సృష్టి చేయవలసిన అవసరం ఉందన్నారు.

బహుజన పోరాటం అంటే కుల పోరాటం కాదని దేశంలో జరుగుతున్న సామాజిక ఉద్యమమన్నారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని గొంతు ఎత్తిన సాహిత్య లోకం ఉత్పత్తి కులాలు చేసే న్యాయ పోరాటానికి అండగా నిలవాలని కోరారు.

బహుజన అస్తిత్వం అన్ని రకాల ఆధిపత్యాల నుండి విముక్తి పొందినప్పుడే సంపూర్ణ స్వాతంత్రం దేశానికి సిద్దించినట్టు అని , ఉత్పత్తి కులాలు చేసే పోరాటానికి మద్దతు పలుకుతూ కలాలు గళాలు గొంతెత్తి గర్జించాలని గౌరి శంకర్ కోరారు. అస్తిత్త సాహిత్యం సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సకల ఆధిపత్యాలను ధిక్కరించినప్పుడే సమరాజ్యం సిద్ధిస్తుందన్నారు.

సమరాజ్యం, సమభావం కలిగినప్పుడే అన్ని వర్గాలు శిరసెత్తుకొని నిలుస్తాయని అస్తిత్వ ఉద్యమాలను విశ్లేషించారు. ఎస్.వి విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రముఖ కవి, విమర్శకులు కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ విస్మృత సాహిత్యాన్ని వెలికితీయటమే అస్తిత్వ ఉద్యమాల లక్ష్యం కావాలన్నారు.

అట్టడుగు వర్గాలను పైకి తేవాల్సిన బాధ్యత పై వర్గాలలోని ప్రజాస్వామిక వాదులపై కూడా బాధ్యత ఉందన్నారు. తానూ సృష్టించిన సాహిత్యం అంతా బడుగుల సాహిత్యమేనన్నారు. ప్రఖ్యాత రచయిత, తెలుగు అధ్యాపకులు షమీవుల్లా మైనారిటీ సాహిత్యాన్ని విశ్లేషించారు.

ప్రసిద్ధ స్త్రీ వాద రచయిత్రి శ్రీమతి ప్రతిమ, స్త్రీవాద సాహిత్య పరిణామ క్రమాన్ని తెలిపారు. ప్రముఖ రచయిత్రి పెళ్లకూరు జయప్రద, సేవా సాహితీ సంస్థ అధ్యక్షులు కంచర్ల సుబ్బరాయుడు, ప్రముఖ కవులు భీరం సుందర్ రావు, డా.పెరుగు రామకృష్ణ, సాధనాల వెంకటస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ సదస్సులో జూలూరు గౌరీశంకర్ రాసిన బహుజన దీర్ఘ కావ్యం “బహుజన గణ మన” ను రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, కొలకలూరి ఇనాక్, కంచర్ల సుబ్బరాయుడు పునరావిష్కరించారు.

Leave a Reply