మక్తల్, ఆంధ్రప్రభ : ఇళ్ల ఎదుట ఆపిన బైకులను రాత్రివేళ దొంగలించి తక్కువ ధరలకు అమ్ముకొని జల్సాలు చేసే నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. మక్తల్ పోలీస్ స్టేషన్‌లో స్థానిక సీఐ రామ్ లాల్, ఎస్సై వై.భాగ్యలక్ష్మి రెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు.
హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని మారుతి నగర్‌కు చెందిన కంచికోరమ్ ఎల్లప్ప (33) తో పాటు కర్ణాటకలోని సింధనూర్ సమీపంలోని 3వ మెయిల్ క్యాంపు వీరాపూర్‌కు చెందిన సన్నదుర్గప్ప(36) రాత్రి వేళల్లో ఇళ్ళ ముందు పార్కు చేసిన బైకులను దొంగిలించి కర్ణాటకలోని యాదగిరి జిల్లా బసవేశ్వర నగర్ శారాపూర్‌కు చెందిన శంషాద్‌తో కలిసి బైక్ లను అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసే వారని డీఎస్పీ వెల్లడించారు.
శుక్రవారం రోజు మక్తల్ పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, వారు బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారని తెలిపారు.
నిందితుల నుంచి 5 బైకులను,రూ.4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులపై హైదరాబాద్ సైఫాబాద్ పీఎస్ పరిధితో పాటు గద్వాల, మక్తల్, కృష్ణ, మరికల్ పీఎస్‌ల పరిధిలో కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు నిందితులను కోర్టులో హాజరుపరచగా నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.