- 74 టీఎంసీలకు నీటి నిలువలు
- 80 టీఎంసీలకు చేరగానే దిగువకు
- నేడో ..రేపో విడుదలకు అవకాశం
- మరో 10 అడుగుల దూరంలో శ్రీశైలం డ్యాం
- 874 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
కర్నూలు బ్యూరో, జులై 1, ఆంధ్రప్రభ : కర్ణాటక (Karnataka) లోని తుంగ, భద్ర, మల ప్రభకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో తుంగభద్ర జలాశయం (Tungabhadra Reservoir) నిండుకుండలా నిండుకుంది. ప్రస్తుతం తుంగభద్ర నీటిమట్టం 1633 అడుగులు కాగా, 1624.38 అడుగులకు చేరుకుంది. ఇక జలాశయ నీటి నిల్వ కెపాసిటీ 105.788 టీఎంసీలకు గాను, 74.486 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఎగువ తుంగ, భద్ర నుంచి 33916 క్యూసెక్కుల నీరు జలాశయంకు చేరుకుంటుంది. ఇక ఇదే సమయంలో జలాశయం నుంచి 2389 క్యూసెక్కుల నీరు కాలువలకు వెళ్తుంది.
శ్రీశైల జలాశయంకు వరద జోరు…
కర్ణాటక, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలంకు వరద పోటెత్తుతుంది. ముఖ్యంగా కృష్ణమ్మ (Krishnamma) పరవళ్ళు తొక్కుతుంది. జూరాల నుంచి విడుదలవుతున్న నీరు నేరుగా శ్రీశైలం చేరుకుంటుంది. ఈ క్రమంలో శ్రీశైల జలాశయ నీటిమట్టం 885 అడుగులకు గానూ 874.30 అడుగులకు చేరుకుంది. ఇక జలాశయంలో 215.8070 టీఎంసీలకు గానూ 160.5282 టీఎంసీలకు చేరుకుంది. ఇక ఇదే సమయంలో జూరాల నుంచి డ్యామ్ లోకి 1,00,085 క్యూసెక్కుల నీరు చేరుతుంది. ఇందులో జూరాల పవర్ హౌస్ (Jurala Power House) నుంచి 26,072 క్యూసెక్కులు, స్పిల్ వే నుంచి 74,029 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ఆ నీరు నేరుగా శ్రీశైల జలాశయంకు చేరుకుంటుంది. ఇక శ్రీశైల జలాశయం నుంచి 58,750 క్యూసెక్కుల నీరు పవర్ ఉత్పత్తి ఇతర వాటికి విడుదలవుతుంది.
ఇందులో ఏపీ పరిధిలోని కుడి విద్యుత్ కేంద్రం నుంచి 11,061 క్యూసెక్కుల నీటిని వినియోగించి… 6.068 మెగా యూనిట్లు, విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. ఇక తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 19,031క్యూసెక్కుల నీటిని వినియోగించి 9.504 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మొత్తంగా శ్రీశైలం డ్యాం నుంచి 30,276 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది.