ప్రజలకు బీమా వ్యాప్తిని మరింత పెంచాలి…

- బీమా కంపెనీలకు మరిన్ని లైసెన్సులు ఇవ్వాలి
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : భారతదేశంలో బీమా వ్యాప్తిని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 70 నుంచి 72 బీమా కంపెనీలే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, అదే శ్రీలంక వంటి చిన్న దేశంలోనే సుమారు 50 బీమా కంపెనీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎక్కువ జనాభా కలిగిన మన దేశానికి ఈ సంఖ్య చాలా తక్కువగా ఉందని వ్యాఖ్యానించారు.
బీమా వ్యాప్తి, క్రెడిట్ విస్తరణను పెంచాలంటే బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీలు) మరిన్ని లైసెన్సులు మంజూరు చేయడంపై ఆర్‌బీఐ దృష్టి సారించేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష’ బిల్లుకు టీడీపీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.
భారతదేశంలో బీమా వ్యాప్తి జాతీయ స్థాయిలో కేవలం 3.7 శాతం మాత్రమే ఉందని, ఇది ప్రపంచ సగటు 7 శాతంతో పోలిస్తే చాలా తక్కువని ఆయన అన్నారు. బీమా రంగాన్ని నియంత్రించే భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) విధానాలు కొంత కఠినంగా ఉన్నాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆరోగ్య బీమా వంటి ఎంతో ప్రయోజనకరమైన పథకాలను మరింత విస్తృతంగా అమలు చేసి పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, బీమా ప్రయోజనాలు సకాలంలో లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా బీమా సౌకర్యాన్ని విస్తరించే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక శాఖ చేపట్టిన చర్యలను ఎంపీ లావు ప్రశంసించారు. ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య బీమాపై జీఎస్టీని 18 శాతం నుంచి 0 శాతానికి తగ్గించడం, బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతి ఇవ్వాలనే నిర్ణయాలు బీమా పాలసీలకు అనుకూల పరిణామమని ఆయన పేర్కొన్నారు.
