కోనసీమ జిల్లా : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను తన దిశను అనూహ్యంగా మార్చుకుంది. తాజా వాతావరణ నివేదికల ప్రకారం, ఈ తుఫాను కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. రాబోయే మూడు నుంచి నాలుగు గంటలు అత్యంత కీలకమని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యవధిలో తుఫాను వేగం , తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిన మొంథా తుపాను ప్రస్తుతం మచిలీపట్నం నుంచి 20 కిమీ, కాకినాడ నుంచి 110 కిమీ, విశాఖపట్నం నుంచి 220 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను పూర్తిగా తీరం దాటడానికి ఇంకా 3–4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
తుఫాను తీరం దాటేందుకు సుమారు ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 90–110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా, సముద్రంలో అలల ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో కోనసీమ ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. సహాయక బృందాలు అప్రమత్తంగా పహారాలో ఉన్నాయి.

