TG | అల్లుడిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన అత్తమామలు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
- అలిగిన భార్యను చూసేందుకు వెళితే …
- పెట్రోల్ పోసి తగులబెట్టిన వైనం
భద్రాద్రి కొత్తగూడెం : కుటుంబ కలహాలు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. దంపతుల మధ్య కలహాలు రావడంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. తర్వాత భర్త అత్తగారింటికి వెళ్లి భార్య పిల్లలను చూద్దామనుకుంటే అత్తింటి వారు అతడిని అడ్డుకున్నారు. అంతేనా.. ఇంటి అల్లుడన్న విషయం మరచి అతడిపై అత్తామామ, బామ్మర్దులు ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించి, ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఒళ్లంతా మంటలు రేగడంతో అల్లుడు సమీపంలోని నీటి తొట్టిలో పడిపోయాడు. ఇరుగు పొరుగు గమనించి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు, అనురాధ దంపతుల కుమార్తె కావ్య. ఆమెను మూడేండ్ల క్రితం పాల్వంచ మండలం దంతలబోరు గ్రామానికి చెందిన బల్లెం గౌతమ్ (24) ప్రేమ వివాహం చేసుకున్నాడు. గౌతమ్ ఎలక్ట్రిషన్ పనిచేస్తూ సుజాతనగర్‌లో నివాసం కాపురం పెట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు. అయితే 5 నెలల క్రితం భార్యాభర్తలు గొడవ పడటంతో కావ్య అలిగి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 2న రాత్రి భార్యా పిల్లలను చూసేందుకు గౌతమ్ అత్తింటికి వెళ్లాడు.
అయితే అల్లుడు గౌతమ్‌ను అత్త మామ, బామ్మర్దులు ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారు గౌతమ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకున్నారు. మంటలకు తాళలేక గౌతమ్ కేకలు వేస్తూ పక్కనే ఉన్న నీటితొట్టిలో పడిపోయాడు.
తీవ్రంగా గాయపడిన అతడిని అతడిని ఇరుగు పొరుగు ఖమ్మం హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గౌతమ్ నేటి ఉదయం మృతి చెందాడు. మృతుడి తండ్రి బల్లెం వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.