- కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్ !!
న్యూఢిల్లీ : లోక్‌సభ వేదికగా మంగళవారం కాంగ్రెస్ నేత, విపక్షాల నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
పహల్గాం ఉగ్రదాడి సమయంలో కేంద్ర ప్రభుత్వం సైనికుల చేతులను కట్టేయడమే కాకుండా, ఆపరేషన్ సిందూర్‌ను అనూహ్యంగా నిలిపివేసిందని విమర్శించారు. భారత సైన్యానికి తాను గౌరవం తెలుపుతానని, కానీ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా దాడులను అర్ధాంతరంగా ఆపేసిన ప్రభుత్వం దేశ భద్రతపై రాజీపడిందని ఆరోపించారు.
“ఇందిరా గాంధీ 1971లో సైనికులకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారు. లక్షలాది పాక్ సైనికులు లొంగిపోయారు. కానీ ఈ ప్రభుత్వం ఆ ధైర్యాన్ని చూపడం లేదు.” అని రాహుల్ విమర్శించారు.
ఆపరేషన్ సిందూర్ విషయంలో పాకిస్థాన్‌తో కాల్పుల విరమణపై కేంద్రం దిగొచ్చిందని, కేవలం 30 నిమిషాల్లోనే నిర్ణయం మార్చుకుందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ “తానే యుద్ధాన్ని ఆపించాను” అనే మాటను ట్రంప్ 29 సార్లు అన్నారని, దీనిపై కేంద్రం క్లారిటీ ఇవ్వలేదని చెప్పారు.
పహల్గామ్ దాడిని విదేశాంగ విధాన వైఫల్యానికి ఉదాహరణగా పేర్కొంటూ, దాని వెనుక సూత్రధారి అయిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు అమెరికా ఆతిథ్యం ఇవ్వడంపై మోడీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చైనా, పాక్ కలిసి భారత్‌పై సమాచార, సాంకేతిక దాడులు చేస్తున్నాయని, అయినా కేంద్రం అప్రమత్తంగా వ్యవహరించలేదని విమర్శించారు.
“దేశం సీరియస్ ప్రమాదంలో ఉంది. దేశ భద్రత, సైనిక గౌరవంపై రాజీ పడే ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు” అని గాంధీ అన్నారు.