పత్తి పంటకు గిట్టుబాటు ధర
ఆగ్రోటెక్ జిన్నింగ్ మిల్ నందు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు
జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్
నంద్యాల బ్యూరో, అక్టోబర్ 25 (ఆంధ్రప్రభ) : జిల్లాలోని రైతులందరూ తాము పండించిన పత్తిని అమ్ముకునేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ (Joint Collector) పేర్కొన్నారు. పట్టణంలో ఏర్పాటుచేసిన జిన్నింగుమిల్లు నందు గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చునని జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తెలిపారు.
శనివారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జెసి కొల్లా బత్తుల కార్తీక్ జిల్లాస్థాయి పత్తి కొనుగోలు కమిటీ (Cotton Purchase Committee) సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్రప్రభుత్వం పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. పత్తి రైతులు తాము పండించిన పత్తిని గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు పట్టణంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రస్తుతం మార్కెట్ లో పత్తి కనీస మద్దతు ధర రూ.7710…పొట్టి పింజ రకం, రూ.8110….పొడవు పింజరకం కంటే తక్కువ ఉన్నందున నంద్యాల పట్టణంలో శ్రీ మురారి పవన్ ఆగ్రోటెక్ జిన్నింగు మిల్లులో కాటన్ కార్పోరేషన్ వారు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. పత్తి రైతులు వారు పండించిన పత్తిని జిన్నింగుమిల్లునకు తీసుకువచ్చి గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చునన్నారు.
రైతులు జిన్నింగు మిల్లుకు తీసుకొచ్చే పత్తిని ముందుగా రైతుసేవ కేంద్రంలో ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ అండ్ కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ చేయించుకొని జిన్నుంగు మిల్లునకు తీసుకురావలసిందిగా తెలిపారు. పత్తికి కనీస నాణ్యత ప్రమాణాలు ఫెయిర్ అవేరేజ్ క్వాలిటీ గ్రేడ్ పాటించవలసినదిగా తెలియజేశారు. ఈ-క్రాపు రిజిస్ట్రేషన్, కపాస్ కిసాన్ అప్ లో స్లాట్ బుకింగ్ లో నమోదు చేసుకొన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేయబడునన్నారు.. సదరు అవకాశాన్ని నంద్యాల జిల్లా పత్తి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి అబ్దుల్ రెహ్మాన్, జిల్లా వ్యవసాయ అధికారి, ఫైర్ అధికారి ట్రాన్స్ పోర్ట్ అధికారి, జిల్లా అడిషనల్ ఎస్పీ మురారి జిన్నింగ్ మిల్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

