సంస్థాగతంగా కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం..

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం సంస్థాగత నిర్మాణ కార్యక్రమం చేపట్టిందని రాజస్థాన్ రాజ్యసభ సభ్యుడు నీరజ్ డాంగీ అన్నారు. కొండపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్ ఆధ్వర్యంలో శనివారం సంఘటన శ్రీజాన్ అభియాన్ (సంస్థాగత నిర్మాణం) కార్యక్రమం నిర్వహించారు.

ఏఐసీసీ ఆదేశానుసారం ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు రాజస్థాన్ రాజ్యసభ సభ్యుడు నీరజ్ డాంగీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీజేపీ కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు.

దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడి, అన్ని వర్గాలకు సమన్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కమిటీని నియమించడానికి కార్యకర్తలతో క్షేత్రస్థాయిలో మాట్లాడినట్లు తెలిపారు.

ప్రతి కార్యకర్త వ్యక్తిగత అభిప్రాయం సేకరించి కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా జిల్లా అధ్యక్షులను ఎన్నుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, యువ నేత రాహుల్ గాంధీ మెరుగైన ఆలోచనలో భాగంగా సామాన్య ప్రజలను సైతం రాజకీయాల్లో భాగస్వాములను చేయనున్నామని తెలిపారు.

కేవలం జిల్లా స్థాయిలోనే కాకుండా మండల, బూత్ స్థాయి కమిటీలకు కూడా ఈ ప్రక్రియను తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లోటుపాట్లను అధిగమించి పార్టీని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తప్పకుండా ఈ విధానం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ లో మార్పు వస్తుందని, ప్రజలు కాంగ్రెస్ భావాలను అర్థం చేసుకొని మళ్లీ కాంగ్రెస్ ను బలపేతం చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొర్రా కిరణ్ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకానికి ఈనెల 24 నుంచి సంస్థాగత నిర్మాణ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. అన్ని నియోజకవర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటి ప్రకారం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అందులో భాగంగా శనివారం మైలవరం నియోజకవర్గానికి వచ్చారని వారికి కార్యకర్తలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలుపుతున్నారని చెప్పారు.

విజయవాడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ చార్జి వల్లూరి భార్గవ్ మాట్లాడుతూ కమిటీలను నియమించే ముందు మండల, బూత్ స్థాయి కార్యకర్తల అభిప్రాయాలను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టడం శుభపరిణామం అన్నారు. ఆశావాహులు, ఆసక్తి ఉన్నవాళ్లు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను పరిశీలకులకు వెల్లడించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ పరిశీలకులు కొరివి వినయ్ కుమార్, కంట అంజిబాబు, జ్యేష్ట సతీష్ బాబు, మైలవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply