ఖమ్మం : మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (Sunil Dutt) పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కారించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదకద్రవ్యాల నిర్ములన అవగాహన ర్యాలీలో మమత మెడికల్ కాలేజ్, హార్వేస్ట్ కాలేజ్, ఎస్ ఆర్ అండ్ జిజిఎన్ ఆర్ ఐ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. మమత రోడ్డు (Mamatha Road) లో గల టాటా మోటార్ సర్వీస్ సెంటర్ నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు సాగిన ఈ ర్యాలీని అడిషనల్ కలెక్టర్ (స్దానిక సంస్థల) డాక్టర్ పి.శ్రీజతో కలసి పోలీస్ కమిషనర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
మత్తుపదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని విద్యార్థులు ప్లకార్డులు (Placards) ప్రదర్శించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి, యాంటి డ్రగ్స్ సోల్జర్ గా సైన్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… యువత పురోగతికి, భావి జీవితానికి అవరోధంగా నిలుస్తున్న మాధకద్రవ్యాలను సమాజం నుండి సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విజ్ఞప్తి చేశారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్, గంజాయి (Drugs, marijuana) లాంటి మత్తు పదార్ధాలకు బానిసలై వారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు.
చెడు వ్యసనాలకు బానిసలై అనారోగ్యం పాలవుతూ బంగారు భవిష్యత్తును కోల్పోవడమే కాకుండా, ఎన్నో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ తమ చేతులారా భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, దానికోసమే ముందుగానే మత్తు పదార్థాలను నిర్మూలించి యువతను మత్తు అనే మహమ్మారి నుండి కాపాడుకోవాలని సూచించారు. జిలాల్లో గంజాయి, డ్రగ్స్ నిర్ములనకు జిల్లాలోని కళాశాలలో, పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని ఉపాధ్యాయులకు, యాంటీ డ్రగ్ కమిటీలకు, డయల్ 100,1908, పోలీస్ వారికి అందించాలని సూచించారు.

అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ. … సరదా కోసం మొదలైన అలవాటు.. మత్తులోకి నెడుతోందని, గతంలో సిగరెట్, మద్యంతో సరిపెట్టుకునే యువత.. ఇప్పుడు నిషా కోసం గంజాయి, మాదకద్రవ్యాల బారినపడి మత్తుకు బానిసలవుతున్నారని అన్నారు. సమాజంలోని మాదకద్రవ్యాల ముప్పును అంతం చేసే లక్ష్యంలో యువత భాగస్వామ్యం కావాలని అన్నారు. తల్లిదండ్రులు నమ్మకంతో ఇచ్చిన స్వేచ్ఛను విద్యార్థులు దుర్వినియోగం చేసుకోకుండా ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, టౌన్ ఏసీపీ రమణమూర్తి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అధికారి రాంగోపాల్ రెడ్డి , డాక్టర్ నీతీశ్, ఇన్స్‌పెక్టర్లు భానుప్రకాశ్, కరుణకర్, స్వామి, సత్యనారాయణ పాల్గొన్నారు.