ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట (Red Fort)పై ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) నాడు భారత ప్రధాని త్రివర్ణ పతాకాన్ని (national flag) ఎగురవేస్తారు. అయితే ఈ జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ఉపయోగించే తాడుకు (flagpole flying) ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు, ఈ తాడును దిల్లీలోని ఒకే కుటుంబానికి చెందిన దుకాణం వారు తయారు చేస్తున్నారు.
ప్రస్తుతం ఐదవ తరానికి చెందిన నరేశ్ జైన్ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కుటుంబం దాదాపు 75 సంవత్సరాలుగా ఉచితంగా ఈ తాళ్లను తయారు చేసి సైన్యానికి అందిస్తున్నారు. ఆగస్టు 15కు రెండు నెలల ముందు నుంచే ఈ తాళ్లను తయారు చేస్తారు. తర్వాత ఆగస్టు 15కి సుమారు 15 రోజుల ముందు ఆర్మీ అధికారులు వచ్చి వాటిని తీసుకెళ్తారు. వేడుక ముగిసిన తర్వాత వాడిన తాళ్లను తిరిగి ప్యాక్ చేసి దుకాణం వారికి పంపుతారు. ఈ సేవకు గుర్తింపుగా సైన్యం ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తుంది. ఈ చిన్న కానీ గొప్ప సంప్రదాయం దేశభక్తికి, నిస్వార్థ సేవకు నిదర్శనం.