జనగణనతో ప్రణాళికలకు బలం..

జనగణనతో ప్రణాళికలకు బలం..

మే 1 నుంచి తొలి దశ గృహ గణన ప్రారంభం
నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్

కర్నూల్ కార్పొరేషన్, ఆంధ్రప్రభ : జనగణన ప్రక్రియ ద్వారా ప్రభుత్వాలు రూపొందించే ప్రజా సంక్షేమ ప్రణాళికలకు మరింత బలం చేకూరుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ పేర్కొన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో జనగణన అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, అనంతరం చెక్‌పోస్ట్ సమీపంలో ఫీల్డ్ ట్రైనర్లు చేపడుతున్న సరిహద్దుల గుర్తింపు ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మే 1 నుంచి 30 వరకు తొలి విడతగా గృహ జాబితా తయారీతో పాటు గృహ గణన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రతి కుటుంబానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు సేకరించబడతాయని, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఇవి కీలక ఆధారంగా నిలుస్తాయని వివరించారు.


జనాభా గణాంకాల ఆధారంగా మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్య, పన్నుల ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చి సిద్ధం చేస్తున్నామని, ప్రస్తుతం నగర పరిధిలో గృహాల వారీగా సరిహద్దుల నిర్ధారణ, బ్లాక్ విభజన వంటి ప్రాథమిక ప్రక్రియలు కొనసాగుతున్నాయని తెలిపారు.జనగణన ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ సూచించారు.


ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, సెన్సస్ అధికారి ఎస్. ఇశ్రాయోలు, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply