నిరంతర కృషితో, అసాధారణ రికార్డులతో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ బ్యాటర్.. టీమిండియా రన్ మెషీన్ ఈరోజుతో అంతర్జాతీయ క్రికెట్‌లో 17 ఏళ్ల అద్భుత ప్రయాణాన్ని పూర్తి చేశాడు.
ప్రస్తుత క్రికెట్‌లో బ్యాటర్లు అందరూ ఒక వైపు ఉంటే, విరాట్ కోహ్లీ మాత్రం మరో అంచున నిలుస్తాడు. కోహ్లీ బరిలోకి అడుగుపెడితే బౌలర్లు తమ ప్రణాళికలు మార్చుకుంటారు, ఫీల్డర్లు మరింత అప్రమత్తం అవుతారు. పరుగులు సాధించలనే అతని తపన, విజయంపై ఉన్న ఆకలి ప్రత్యర్థులకు వనణుకుపుట్టిస్తుంది.
మన కింగ్ కోహ్లీ… 2008లో ఈరోజే, 19 ఏళ్ల వయసులో దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అండర్–19 2008 ప్రపంచకప్‌లో విజయం సాధించడం విరాట్ కోహ్లీ కెరీర్‌కు మలుపు తీసుకొచ్చింది.
ఆ టోర్నీలో మెరిసిన తర్వాత ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అదే ఏడాది శ్రీలంకతో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాలు జట్టులో లేకపోవడంతో, అప్పుడే అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన కోహ్లీ నేరుగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. 17 ఏళ్ల తర్వాత ఆ యువకుడు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లోనే గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు.
తొలి మ్యాచ్‌లో గంభీర్‌తో కలిసి ఓపెనింగ్‌కి దిగిన విరాట్ అంతగా రాణించలేకపోయాడు. కేవలం 12 పరుగులకే ఔటయ్యాడు. అయితే, ఆ సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో మాత్రం అర్ధశతకం బాదుతూ భారత్ విజయానికి దోహదపడ్డాడు. ఆ సమయంలో అవకాశాలు పెరుగుతాయని అనుకున్నా, సచిన్, సెహ్వాగ్ తిరిగి జట్టులో చేరడంతో కొంతకాలం సైడ్‌లైన్ అయ్యాడు.
ఇక, 2009లో శ్రీలంక పర్యటనలో గాయపడ్డ యువరాజ్ స్థానంలో మరోసారి కోహ్లీకి అవకాశం వచ్చింది. ఈసారి మాత్రం అవకాశాన్ని వదలకుండా ఆడాడు. గౌతమ్ గంభీర్‌తో కలిసి 224 పరుగుల అద్భుత భాగస్వామ్యం అందిస్తూ తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. అప్పటినుంచి కోహ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. అనతికాలంలోనే స్టార్ బ్యాటర్ గా, ఆ తర్వాత భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగాడు.
అతని సారథ్యంలో భారత్ ఎన్నో సిరీస్‌లను గెలుచుకున్నప్పటికీ… ఒక్క ఐసిసి టైటిల్‌ను కూడా గెలుచుకోలకపోయింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 ODI ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, 2021 WTC ఫైనల్‌లో విరాట్ కెప్టెన్సీలో భారత్ ఓడిపోయింది. అదే సమయంలో కోహ్లీ ఫామ్ తగ్గడంతో సారథ్య బాధ్యతలు వదిలేశాడు.
సారథ్యం కోల్పోయినా ఆటగాడిగా మరింత పటిష్టంగా కొనసాగాడు. రోహిత్ నాయకత్వంలో 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీల విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పి, అనూహ్యంగా టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పాడు. అయితే, 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ టైటిల్‌ను చివరికి ఆర్‌సీబీకి అందించాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్న కోహ్లీ, త్వరలోనే పూర్తిగా రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
రికార్డుల రారాజు…
వన్డే క్రికెట్‌లో కోహ్లీ రికార్డులు అద్భుతమైనవి. ఇప్పటివరకు 302 మ్యాచ్‌లలో 14,181 పరుగులు సాధించి 57.88 సగటుతో మూడో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతడి ముందు కేవలం సచిన్ టెండూల్కర్ (18,426), కుమార్ సంగక్కర (14,234) మాత్రమే ఉన్నారు. శతకాల పరంగా కూడా కోహ్లీ టెండూల్కర్‌ను అధిగమించాడు. సచిన్‌కు ఉన్న 49 వన్డే శతకాల కంటే రెండు ఎక్కువగా సాధించి.. 51 శతకాలతో అగ్రస్థానంలో నిలిచాడు.

ప్రత్యేకంగా పరుగుల వేటలో కోహ్లీ రికార్డులు విశేషమైనవి. వన్డేల్లో విజయవంతమైన పరుగుల వేటలో 24 శతకాలు సాధించిన ఏకైక ఆటగాడు అతనే. శ్రీలంక (10), వెస్టిండీస్ (9), ఆస్ట్రేలియా (8) జట్లపై ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ వన్డే శతకాలు సాధించిన ఏకైక ఆటగాడు కోహ్లీ కావడం మరో ప్రత్యేకత.
టీ20లలో కూడా కోహ్లీ విశేష ప్రదర్శన చేశాడు. 25 మ్యాచ్‌లలో 4,188 పరుగులు చేసి 48.69 సగటుతో నిలిచాడు. రోహిత్ శర్మ (4,231), బాబర్ ఆజమ్ (4,223) తర్వాత అతను మూడో స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో 39 సార్లు యాభైకి పైగా స్కోరు చేయగా, ఒక శతకం కూడా సాధించాడు. అయితే, 2024లో భారత్ ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.
ఇదిలా ఉండగా, 2025 మేలో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. 123 టెస్ట్‌లలో 9,230 పరుగులు చేసి 30 శతకాలు, 31 అర్ధశతకాలు సాధించాడు. సచిన్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్‌ల తరువాత భారత ఆటగాళ్లలో నాలుగో స్థానంలో నిలిచాడు.
కెప్టెన్‌గా 68 టెస్ట్‌లలో భారత్‌కు 40 విజయాలు అందించి అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. కెప్టెన్సీ బాధ్యతల్లో ఉన్నప్పుడే 5,864 పరుగులు చేసి, ఏడు డబుల్ సెంచరీలు కూడా సాధించాడు. మొత్తం అన్ని ఫార్మాట్లలో కలిపి 27,599 పరుగులు సాధించాడు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ.
ఐసీసీ టోర్నమెంట్లలోనూ కోహ్లీ తన ఆధిపత్యం కొనసాగించాడు. అతను ఇప్పటివరకు ఐసీసీ టోర్నమెంట్లలో 3,954 పరుగులు సాధించగా, వాటిలో 39 సార్లు 50+ స్కోర్లు నమోదు చేశాడు. ఈ పోటీల్లో 15 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, 3 సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. మొత్తంగా ఐసీసీ అవార్డులు 10 దక్కించుకున్నాడు.
దంబుల్లాలో ప్రారంభమైన ఈ ప్రయాణం… 17 సంవత్సరాల తర్వాత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. ఫిట్‌నెస్, క్రమశిక్షణ, పరుగుల కోసం దాహం అన్నీ కోహ్లీని మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఇప్పటికే వయస్సు ముప్పై దాటిన కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఇద్దరూ ఆ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో భారత్‌కు తక్కువ వన్డే మ్యాచ్‌లు ఉన్నా, అభిమానులు మాత్రం కోహ్లీ నుంచి మరోసారి అద్భుత ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నారు.